
సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితుడు
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలో ఘటన
సాక్షి టాస్క్ ఫోర్స్: పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వేధిస్తున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం బండ్లపల్లి పంచాయతీ కమ్మవారిపల్లికి చెందిన ఆదికేశవ కుమారుడు భాస్కర్‌నాయుడు సెల్ఫీ వీడియోలో ఆరోపిస్తూ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నంచాడు. ఆ వీడియోలో ‘కొత్తచెరువు సీఐ జి. మారుతీశంకర్ కేసుల పేరుతో వేధిస్తున్నాడు. రోజూ స్టేషన్‌కు రావాలని కబురు పంపిస్తున్నాడు. రౌడీïÙట్ తెరిచామని.. స్టేషన్‌కు సకాలంలో రాకుంటే మరిన్ని కేసులు నమోదుచేస్తామని బెదిరించారు.
అనవసరంగా నాపై కొందరు రాజకీయ నాయకులు కుట్ర పన్నినట్లు అర్ధమవుతోంది. అందుకే సీఐ ద్వారా వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేకున్నా’.. అంటూ వివరించాడు. అనంతరం.. తన పొలంలోకి వెళ్లి పురుగుల మందు సేవించాడు. స్థానికులు గమనించి అతనిని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ నుంచి అనంతపురం తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు.
కూటమి నేతల ఒత్తిళ్లతో..
కొన్ని రోజులుగా కొత్తచెరువు మండలంలో అనేకమందిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే కేసు నమోదుచేసి బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ కూటమి నేతల ఒత్తిళ్లతో పోలీసులు కేసుల పేరుతో వేధిస్తుండడంతో ఇప్పటికే బాధితులు కొందరు గ్రామాలు విడిచి వెళ్లిపోయారు. తప్పు ఎవరిదనే విషయంపై ఆరా తీయకుండా.. కూటమి నేతలు చెప్పినట్లు విధులు నిర్వర్తిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు మండిపడుతున్నారు.