
తాగునీటి కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా
పుట్టపర్తి టౌన్: గొంతుతడిపే గుక్కెడు నీటి కోసం నల్లమాడ మండలం గోపేపల్లి తండా వాసులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని తీర్చాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌ను కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో తమ సమస్యపై అర్జీ ఇచ్చేందుకు వచ్చన గోపేపల్లి తండా వాసులను లోనికి అనుమతించకపోవడంతో తండావాసులు కలెక్టరేట్ ఎదుటే భైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమ తండాలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, నెలకు ఒకసారి గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు బోరు మోటర్ పంప్ కూడా కాలిపోతోందన్నారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్య గురించి పట్టించుకోలేదన్నారు. తాజాగా 20 రోజల క్రితం బోరు మోటరు కాలిపోవడంతో తాము సమీపంలోని వ్యవసాయ బోరుమోటార్ల వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామని వాపోయారు. పంచాయతీ సర్పంచ్ రూ.40 వేల పంచాయతీ నిధులు ఖర్చు చేసినా తాగునీటి సమస్య మాత్రం తీరలేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు. అనంతరం అధికారులు అనుమతించడంతో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ మేరకు అర్జీ ఇచ్చారు. స్పందించిన జాయింట్ కలెక్టర్ విద్యుత్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించినట్లు వారు వెల్లడించారు.