
పండుగలు మతసామరస్యాన్ని చాటాలి
హిందూపురం: పండుగలు మతసామరస్యాన్ని చాటాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. ఈ నెల 4వ తేదీ హిందూపురంలో గణేష్ నిమజ్జనం, 5వ తేదీన మిలాద్– ఉన్–నబీ పర్వదినం నేపథ్యంలో సోమవారం ఆమె హిందూపురంలో పర్యటించారు. తొలుత డీఎస్పీ మహేష్‌తో కలిసి పోలీసుల స్కూటర్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఏపీఎస్పీ ప్లటూన్, సాయుధ బలగాలతో కలిసి హిందూపురం ప్రధాన రహదారిలో కవాతు నిర్వహించారు. అనంతరం గణపతి నిమజ్జన శోభాయాత్ర సాగే రూట్లను, విగ్రహాలను నిమజ్జనం చేసే గుడ్డం కోనేరును పరిశీలించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. రెండు పండుగల సందర్భంగా రెండురోజుల పాటు హిందూపురం ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈనెల 4వ తేదీన గణేష్ నిమజ్జనం సందర్భంగా పట్టణంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆమె స్థానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ముస్లిం మతపెద్దలతో సమావేశమయ్యారు. మిలాద్–ఉన్– నబి పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముస్లిం మత పెద్దలతో చర్చించారు. ఎస్పీ వెంట డీఎస్పీ కేవీ మహేష్, సీఐలు రాజగోపాల్ నాయుడు, కరీం, జనార్దన్, పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.
జిల్లా ప్రజలకు ఎస్పీ రత్న పిలుపు
హిందూపురంలో
పోలీసులతో కలిసి కవాతు
గణేష్ నిమజ్జనం శోభాయాత్ర
రూట్ మ్యాప్ పరిశీలన
మిలాద్–ఉన్–నబీ ఏర్పాట్లపై
ముస్లిం మతపెద్దలతో చర్చ