
బంతి పూలహారం @ రూ.71,000
రొళ్ల: మనం ఇప్పటి వరకూ రూ.లక్షల్లో పలికిన వినాయకుడి లడ్డూ వేలం చూసి ఉంటాం. కానీ రొళ్ల మండల పరిధిలోని జీరిగేపల్లి గ్రామంలో మాత్రం వినాయకుడి మెడలోని పూలహారం ఏటా వేలం వేస్తారు. ఈ సారి కూడా సోమవారం వినాయకుడి మెడలో అలంకరించిన పూలహారం వేలం నిర్వహించగా.. గ్రామస్తులు భారీగా పోటీ పడ్డారు. చివరకు రొళ్ల వీరనాగమ్మ వైన్స్ యజమాని నగేష్ ఏకంగా రూ.71,000కు వినాయకుడి మెడలోని పూలహారాన్ని దక్కించుకున్నారు.
బంతి పూల మాలకు భారీ రేటు..
జీరిగేపల్లి గ్రామంలో ఏటా వినాయక చవితి రోజున స్వామివారి మెడలో ప్రత్యేకంగా తయారు చేసిన బంతిపూల మాల వేస్తారు. ఐదో రోజు నిమజ్జనం సందర్భంగా ఆ పూలమాలను వేలం వేస్తారు. వేలం పాట ద్వారా వచ్చిన డబ్బును మరుసటి సంవత్సరం స్వామివారిని కొలువుదీర్చేందుకు ఉపయోగిస్తారు. వినాయకుడి మెడలోని పూలమాలను దక్కించుకున్న వారికి మంచి జరుగుతుంది గ్రామస్తులు విశ్వాసం. అందుకే మామూలు బంతిపూల మాల కూడా ఇక్కడ రూ.వేలు పలుకుతోంది.
‘స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్’లో
నమోదు చేసుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌లో మంగళవారంలోపు రిజిస్టర్ చేసుకోవాలని అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు, జిల్లా సైన్స్ అధికారి బాలమురళీకృష్ణ సూచించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ, సైన్స్ పరిశోధన సంస్థ సంయుక్తంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి విద్యార్థుల్లో సైన్స్ పట్ల జిజ్ఞాసను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. సెన్స్ పరిజ్ఞానాన్ని ప్రదర్శించుకునేందుకు, పెంపొందించుకునేందుకు స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ చక్కని అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రతి స్కూల్‌లోనూ కనీసం 50 మంది విద్యార్థులను గ్రూపులుగా విభజించి వారితో ఆవిష్కరణలు చేయించాలని సూచించారు.
ఐవీఎఫ్ కేంద్రాలకు అనుమతి తప్పనిసరి : డీఎంహెచ్‌ఓ
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో అనుమతులు లేకుండా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ సెంటర్ (ఐవీఎఫ్ – సంతాన సాఫల్య కేంద్రం) ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం హెచ్చరించారు. సోమవారం హిందూపురంలో అనుమతి ఉన్న ఏకైక సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ప్రతి నెలా ఐవీఎఫ్ సేవలు పొందుతున్న వారి వివరాలను అధికారులకు సమర్పించాలన్నారు. తల్లిదండ్రులు కావాలన్న దంపతుల ఆశలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఫీజుల దోపిడీకి తెరలేపినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి విధానాలకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు. ఐవీఎఫ్ సేవలు అందుబాటులో ఉన్నాయని కానీ, ఉచిత కన్సల్టెన్సీ పేరుతో బోర్డులు ఏర్పాటు చేసినా సదరు ఆస్పత్రుల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు బనాయించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.