
రాష్ట్రంలో అరాచక పాలన
గోరంట్ల: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న గ్రామల్లో అధికార పార్టీ నాయకులు చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. సోమవారం ఆమె గోరంట్లలో పర్యటించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఆదివారం మండల పరిధిలోని వెంకటరమణపల్లి గ్రామంలో అధికార పార్టీ నాయకులు చేసిన దాడిలో గాయపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పరామార్శించారు. ఈ సందర్భంగా గోరంట్లలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వెంకటరమణపల్లిలో వినాయకుని ఉరేగింపు కార్యక్రమాన్ని అధికార పార్టీ నాయకులు అడ్డగించడం హేయమైన చర్య అన్నారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలకు కొంతమంది పోలీసు అధికారులు వత్తసు పలకడం శోచనీయమన్నారు. టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ వారిపై దాడులు చేస్తే సీఐ శేఖర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పైగా బాధితులైన వైఎస్సార్ సీపీ నాయకులనే అదుపులోకి తీసుకోవడం అన్యాయమన్నారు. అందువల్లే గ్రామస్తులంతా ధర్నాకు దిగారని, అప్పుడుగానీ సీఐ శేఖర్ ఇరువర్గాలను అదుపులోకి తీసుకోలేదన్నారు. సీఐ శేఖర్ టీడీపీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని, మండలంలోని పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కావాలనే పోలీసు స్టేషన్ కు పిలిపించి కేసుల పెడతామని బయపెడుతున్నారన్నారు. కొన్నిరోజుల క్రితం సీఐ శేఖర్ కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తను స్టేషన్‌కు పిలిపించి వేధించారన్నారు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగం సభ్యులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే... వెంటనే వారిని స్టేషన్‌కు పిలిపించి భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. సీఐ శేఖర్ తన పనితీరు మార్చుకోకపోతే పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు, న్యాయం పోరాటం చేస్తామన్నారు. వెంకటరమణపల్లిలో జరిగిన ఘటనలో అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోకపోతే పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.
అధికారం కోసమే అలవిగాని హామీలు..
పెనుకొండ రూరల్: అధికారం కోసమే కూటమి పార్టీల నేతలు ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు గుప్పించారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. సోమవారం ఆమె మండలంలోని అడదాకులపల్లిలో ‘కాఫీ విత్ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు.. అధికారంలో చేపట్టిన రోజు నుంచి ప్రజలను వంచిస్తున్నారన్నారు. కొత్తగా పథకాలు ఇవ్వకపోగా.. ఉన్న పథకాల్లోనే కోతలు విధించి ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అర్హతే ప్రామాణికంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత వైఎస్సార్ సీపీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, సర్పంచ్ అలివేలమ్మ, పట్టణ, మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, మండల మాజీ కన్వీనర్లు నాగళూరు బాబు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘కూటమి’ అరాచకాలకు
పోలీసుల వత్తాసు దుర్మార్గం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్