
కాలువ భూమిని కబ్జా చేశారు
పుట్టపర్తి అర్బన్: ‘‘బత్తలపల్లి కాలువకు చిత్రావతి నుంచి నీరు వచ్చేందుకు వీలుగా ప్రభుత్వం సర్వే నంబర్178లో 2.9 ఎకరాల భూమిని వదలగా... పెడపల్లి పెద్దతండాకు చెందిన నాగేంద్ర నాయక్ భార్య అరుణాబాయి ఆ భూమిని ఆక్రమించారు. అక్రమంగా డీపట్టా పొంది ప్రస్తుతం భూమిని చదును చేస్తున్నారు. వెంటనే పనులు నిలిపివేయించాలి. రికార్డుల్లోనూ ఆ భూమి కాలువ అనే నమోదై ఉంది. కాలువ పూడ్చి వేస్తే చెరువుకు నీళ్లు వచ్చే వీలు లేకుండా పోతుంది. అదే జరిగితే పెద్దతండా, పైపల్లి గ్రామాలకు తాగు, సాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయి. వెంటనే ఆక్రమణలో ఉన్న భూమిని సంరక్షించాలి’’ అని పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన వడ్డె వెంకటేషు, రాజేంద్ర ప్రసాద్, రమేష్, బి.వెంకటేషు, వెంకటరాముడు, హరీష్ తదితర రైతులు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్‌ను కోరారు. ఈ మేరకు అర్జీ అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై మొత్తంగా 175 అర్జీలు అందాయి. జేసీ అభిషేక్‌కుమార్, డీఆర్‌ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ తదితరులు అర్జీలను స్వీకరించారు. కార్యక్రమం అనంతరం జేసీ అభిషేక్‌కుమార్ మాట్లాడుతూ... అర్జీలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలన్నారు. ఒక్క అర్జీ కూడా బియాండ్ ఎస్‌ఎల్‌ఏకు వెళ్లకూడదన్నారు.
● పుట్టపర్తి మండలం గువ్వలగుట్టపల్లి గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా విద్యుదాఘాతంతో నరసింహమూర్తి మృతి చెందారని, ఇది విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేనని మృతుని తమ్ముడు నాగేంద్ర జేసీకి ఫిర్యాదు చేశారు. విద్యుత్ వైర్లు కిందకు ఉన్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోలేదన్నారు. నరసింహమూర్తికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని, కుటుంబ యజమాని దూరం కావడంతో వారు అనాథలయ్యారన్నారు. తగిన పరిహారం ఇప్పించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
● తనకు కనగానపల్లి మండలం పాతపాళ్యం గ్రామంలోని సర్వే నంబర్ 140–3లో 4 ఎకరాల భూమి ఉందని, వెబ్‌ల్యాండ్‌లో మాత్రం తన పేరు కనబడలేదని లక్ష్మీదేవి జేసీకి ఫిర్యాదు చేశారు. వెబ్‌ల్యాండ్‌లో తన పేరు నమోదు చేయాలని అర్జీ సమర్పించారు. గతంలో పలు మార్లు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీలిచ్చినా ఫలితం లేదన్నారు.
జేసీకి ఫిర్యాదు చేసిన
పెడపల్లి పెడ్డతండా వాసులు
‘పరిష్కార వేదిక’కు 174 అర్జీలు
వచ్చిన అర్జీల్లో కొన్ని ఇలా...

కాలువ భూమిని కబ్జా చేశారు