
ఇళ్లలోకి దూసుకెళ్లిన లారీ
బత్తలపల్లి: మండలంలోని గుమ్మల్లకుంట క్రాస్ ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి ఓ లారీ దూసుకెళ్లింది. పోలీసులు తెలిపిన మేరకు... చైన్నె నుంచి అనంతపురం వైపుగా ఆదివారం తెల్లవారుజామున అగ్గి పెట్టెల లోడుతో వెళుతున్న గుమ్మల్లకుంట క్రాస్ వద్దకు చేరుకోగానే జాతీయ రహదారిపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి ఎస్సీ కాలనీలోకి దూసుకెళ్లింది. డ్రైనేజీ కాలువ దాటుకుని రోడ్డు పక్కన ఉన్న మేరీ దుకాణాన్ని ఢీ కొంది. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న పెద్దన్న ఇంటిని ఢీకొని బోల్తాపడింది. డ్రైవర్ నిద్రమత్తులో జోగడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దుకాణం పూర్తిగా ధ్వంసమైంది. రూ.80 వేలు విలువ చేసే సరుకులు పాడయ్యాయి. పెద్దన్న ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతినడంతో రూ.30వేలు వరకు నష్టం వాటిల్లింది. ప్రమాదం జరిగిన సమయంలో జన సంచారం లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ వెంకటేశులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
కారు ఢీ.. గొర్రెల మృతి
మండలంలోని రామాపురం వద్ద జీవాల మందపై కారు దూసుకెళ్లిన ఘటనలో నాలుగు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అయితే కారు డ్రైవర్, గొర్రెల యజమానులు రాజీ కావడంతో ఘటనపై ఎలాంటి ఫిర్యాదు లేదని పోలీసులు తెలిపారు.