
మృతురాలు ఎం.చెర్లోపల్లి
మాజీ ఎంపీటీసీ కోడలు
శ్రీ సత్యసాయి జిల్లా: మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన కపాడం నాగన్న, కపాడం రామాంజినమ్మ దంపతుల (ఇద్దరూ మాజీ ఎంపీటీసీ సభ్యులు) కుమారుడు రామ్మోహన్ భార్య హరిత (26) గత నెల 29న అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందింది. వీరికి ఏడేళ్ల క్రితం 2018, ఆగస్టు 29న వివాహమైంది. రామ్మోహన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే భార్యతో కలసి ఉంటున్నాడు. నెల రోజుల క్రితం గొంతు నొప్పితో బాధపడుతున్న హరితను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రామ్మోహన్ పిలుచుకెళ్లి చికిత్స చేయించాడు.
ఆ సమయంలో టాన్సిల్స్‌తో ఆమె బాధపడుతోందని, శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు నిర్దారించారు. తాత్కాలికంగా మందులు ఇవ్వడంతో అప్పట్లో ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో గత నెల 29న పెళ్లి రోజును హైదరాబాద్‌లో వేడుకగా జరుపుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం గొంతు నొప్పి తీవ్రం కావడంతో హరితను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పరిశీలించిన వెద్యులు వెంటనే సర్జరీకి ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లిన తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనైన హరిత గుండెపోటుకు గురై మృతి చెందింది.
దీంతో ఆమె మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి చేర్చి, బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి... ఎం.చెర్లోపల్లికి చేరుకుని హరిత మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వైస్ ఎంపీపీ బోయ రామాంజినేయులును రాప్తాడులో పరామర్శించారు. ఆయన వెంట మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ సాకే వెంకటేష్, యూత్ మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి, యూత్ మాజీ కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి ఉన్నారు.