
స్వలాభం కోసమే లైనింగ్ పనులు
కదిరి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన స్వలాభం కోసమే హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు చేపట్టారని వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి.రమణ విమర్శించారు. ఆదివారం కదిరిలోని ఎన్జీఓ హోంలో ‘సాగునీటి ప్రాజెక్టులు–విభజన హామీలు’ అనే అంశంపై వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జి.నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎ.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు సాకే హరి ఇంకా వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ప్రసంగించారు. హంద్రీ–నీవా ఫేజ్–2 కింద 7 ప్యాకేజీల్లో జరిగిన లైనింగ్ పనుల కోసం ప్రభుత్వం రూ.936 కోట్లు వెచ్చించిందన్నారు. కాలువ వెడల్పు చేయకుండా లైనింగ్ పనులు చేయడం ఎవరి ప్రయోజనాల కోసమని వారు ప్రశ్నించారు. ఇందులో టీడీపీ ముఖ్య నేతలకు భారీగా ముడుపులు అందాయని, అందుకే నాసిరకం పనులు చేసినా కూటమి నేతలెవ్వరూ నోరు మెదపడం లేదని ఆరోపించారు. లైనింగ్ పనులు చేపట్టడంతో భవిష్యత్‌లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయని అభిప్రాయ పడ్డారు. లైనింగ్ పనులు వద్దంటున్న రైతుల మాటలను సీఎం పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంకు నీళ్లు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే లైనింగ్ పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టి ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకు తీరని అన్యాయం చేశారని అభిప్రాయపడ్డారు. టీడీపీ హయాంలో తాగునీటి పథకంగా శిలాఫలకాలకే పరిమితమైన హంద్రీ–నీవాను తాగు, సాగునీటి ప్రాజెక్టుగా మార్చిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి దక్కుతుందన్నారు. వైఎస్ చొరవతో 2009 నాటికే హంద్రీ–నీవా మొదటి దశ పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీన్ని 6,300 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించి, ఇందుకోసం రూ.6,182 కోట్ల పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చారని, అదే విధంగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారని చెప్పారు.
విభజన హామీలపై నోరు మెదపరెందుకు..?
విభజన హామీలపై కూటమి పార్టీల నాయకులు నోరు మెదపకపోవడాన్ని వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక నాయకులు తప్పుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై ప్రతి నియోజకవర్గంలో ‘వెనుక బడిన ప్రాంతాల అభివృద్ది వేదిక’ కమిటీలు వేసి ప్రజల్ని చైతన్యం చేయాలని వారు నిర్ణయించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వరరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ లింగాల మధుసూదన్‌రెడ్డి, కదిరి మండల కన్వీనర్ మణికంఠ నాయక్, రైతు విభాగం నాయకులు జైనుల్లా, సీపీఎం జిల్లా నాయకులు నరసింహులు, ఆర్‌సీపీ నాయకులు నాగన్న, రెడ్స్ సంస్థ నిర్వాహకురాలు భానూజా, ఐసీడీఎస్ రిటైర్డ్ సీడీపీఓ నిర్మలమ్మ, న్యాయవాది నరసింహులు, ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి ప్రసాద్ తదితరులు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై గళం విన్పించారు.