వైద్యం.. దైన్యం | - | Sakshi
Sakshi News home page

వైద్యం.. దైన్యం

Sep 1 2025 8:28 AM | Updated on Sep 1 2025 10:17 AM

వైద్య

వైద్యం.. దైన్యం

కొత్తచెరువు సీహెచ్‌సీ ఆస్పత్రికి అదే గ్రామానికి చెందిన డెయిరీ రాజా (రాజశేఖర్‌) ఆదివారం వైద్యం కోసం వచ్చాడు. అయితే సిబ్బంది ఎవరూ స్పందించకపోవడంతో ఆయనే తన కాలుకు డ్రెస్సింగ్‌ చేసుకుని కట్టు కట్టుకుని వెళ్లిపోయాడు. ఇదేంటని అక్కడి ప్రజలు అడగ్గా.. డాక్టర్లు, సిబ్బంది పట్టించుకోలేదని.. ‘నేనే రోగిని.. నేనే డాక్టర్‌ను’ అంటూ వెళ్లిపోయాడు. అక్కడ ఉన్న వాళ్లందరూ అవాక్కయ్యారు.

● కొత్తచెరువు ఆస్పత్రికి శుక్రవారం జ్వరంతో బాధపడుతున్న ఓ రోగి వెళ్లాడు. రక్త పరీక్షలు చేశారు. అప్పటికే మధ్యాహ్నం దాటింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ఉన్నఫలంగా కరెంటు కోత విధించారు. దీంతో ల్యాబ్‌లో పరీక్షలు చేసే వారు రిపోర్టులు ఇవ్వలేకపోయారు. మరుసటి రోజు రావాలంటూ సూచించారు. ఆదివారం ఉదయం వెళ్తే ల్యాబ్‌లో ఎవరూ లేరు. దిక్కుతోచని స్థితిలో ప్రైవేటు ఆస్పత్రికెళ్లి వైద్యం పొందారు.

జిల్లా కేంద్రం పుట్టపర్తికి కూతవేటు దూరంలోని కొత్తచెరువులో మాత్రమే కాదు.. జిల్లాలోని ప్రతి ప్రభుత్వాస్పత్రిలోనూ రోగులు ఇలాగే అవస్థలు పడుతున్నారు. హిందూపురం, ధర్మవరం, కదిరి, పెనుకొండ, మడకశిర, ముదిగుబ్బ, గోరంట్ల.. ఇలా ప్రతి చోట వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో రోగులు దిక్కు తోచని స్థితిలో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.

సాక్షి పుట్టపర్తి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ప్రభుత్వ వైద్యం దైన్యంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఏ పల్లెలో చూసినా రోగులు పదుల సంఖ్యలో ఆస్పత్రుల బాట పడుతున్నారు. వారం రోజుల నుంచి ఓపీ రోగుల సంఖ్య రెట్టింపు అయ్యింది. అయితే రోగులకు వైద్యం చేయడానికి సరిపడా సిబ్బంది ఆస్పత్రిలో లేరు. డాక్టర్లు పట్టించుకోవడం లేదు. సకాలంలో వైద్యం అందక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేనివాళ్లు.. గంటల తరబడి.. కొన్ని రోజుల పాటు నిరీక్షించి వైద్యం పొందుతున్నారు. అయినప్పటికీ రవాణా ఖర్చు.. బయట తినుబండారాలు రూ.వేలల్లో అవుతోందని వాపోతున్నారు. ఇక పెద్దాస్పత్రి అని హిందూపురం జిల్లా ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ వైద్యులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా వచ్చి.. అలా వెళ్తున్నారు!

ఉదయం 8 గంటలకే డాక్టర్లు విధులకు హాజరు కావాలి. ఇన్‌ పేషెంట్ల వార్డుల్లో రౌండ్లు పూర్తి చేసుకుని 9 గంటలకు ఓపీలోకి వచ్చి సేవలు అందించాలి. మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలందించాలి. అయితే ఎక్కువమంది డాక్టర్లు చుట్టపుచూపుగా 10 గంటలకు వచ్చి.. పది నిమిషాల పాటు హడావుడి చేసి.. ఒక టీ తాగి.. గంట పాటు కాలక్షేపం చేసి మధ్యాహ్నానికి వెళ్లిపోతున్నారు. ఉన్నంత సేపు రోగులను పరిశీలించి పరీక్షలు చేయించుకోవాలని రిపోర్టులు రాసి.. రేపు వచ్చి కలవాలని సూచిస్తున్నారు.

జ్వర పీడితులే అధికం..

హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఓపీ రోగుల సంఖ్య సగటున రోజుకు 500 ఉండగా.. నాలుగైదు రోజుల నుంచి 800 దాటుతోంది. ధర్మవరం ఏరియా ఆస్పత్రిలో రోగుల సగటు 200 నుంచి 600 వరకు పెరిగింది. కొత్తచెరువు సీహెచ్‌సీలో 100 నుంచి 300 మంది వరకు వస్తున్నారు. రోగుల్లో 70 శాతం మంది జ్వరపీడితులే కావడం గమనార్హం. గత నెలతో పోలిస్తే జ్వరపీడితులు 20 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

వైద్యం కోసం మళ్లీ.. మళ్లీ!

ఏ ఆస్పత్రిలో చూసినా రోగులు మరుసటి రోజు మళ్లీ రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకే రోగంతో పదే పదే ప్రభుత్వాస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా.. సరైన వైద్యం అందడం లేదని వాపోతున్నారు. ఒక రోజు పరీక్షలు చేస్తారు. మరుసటి రోజు రిపోర్టులు ఇస్తారు. అదే రోజున డాక్టర్‌ పట్టించుకోరు. దీంతో మూడో రోజు వెళ్లి డాక్టర్‌ను సంప్రదించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆస్పత్రుల్లో రోగులను సరిగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అవస్థలు

విధుల్లో ఆస్పత్రి సిబ్బంది,

వైద్యుల నిర్లక్ష్యం

గంటల తరబడి వేచి చూసినా

అందని వైద్యం

టెస్టులు రాసిస్తారు..

రిపోర్టులు వచ్చే లోపు జంప్‌

వైద్యం.. దైన్యం1
1/2

వైద్యం.. దైన్యం

వైద్యం.. దైన్యం2
2/2

వైద్యం.. దైన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement