
ఆ ముగ్గురికీ పింఛన్
ఓడీచెరువు: పచ్చనేతల కుట్రతో రెండు నెలలుగా పింఛన్‌కు నోచుకోని ముగ్గురు వృద్ధులకు ఎట్టకేలకు అధికారులు శనివారం మూడు నెలల పింఛన్ ఒకేసారి అందించారు. మండలంలోని కొండకమర్ల పంచాయతీ చెరువు మునెప్పపల్లికి చెందిన సి.శ్రీనివాసరెడ్డి, సి.చిన్నపరెడ్డి, ఇ. వెంకటశివారెడ్డికి వరుసగా రెండు నెలలు పింఛన్ అందలేదు. పింఛన్ ఐడీలో డబ్బులు చూపుతున్నా సచివాలయ సిబ్బంది వారికి పింఛన్ సొమ్ము అందించకుండా నిర్లక్ష్యం చేశారు. రాజకీయ కక్షతో కొందరు నేతలు అధికారులను భయపెట్టి పింఛన్ అందకుండా చేశారు. ఈ నేపథ్యంలో ‘పింఛన్ అందకుండా ‘పచ్చ’ కుట్ర’ శీర్షికతో శనివారం ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. దీంతో అధికారులు వెంటనే స్పందించారు. శనివారం ఉదయమే సి.శ్రీనివాసరెడ్డి, సి.చిన్నపరెడ్డి, ఇ. వెంకటశివారెడ్డిలకు గత రెండు నెలలతో పాటు ఈ నెల పింఛన్ కలిపి మొత్తం మూడు నెలల పింఛన్ అందజేశారు. దీంతో ఆ ముగ్గురు వృద్ధులు తమ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన ‘సాక్షి’, సత్వరం స్పందించి న్యాయం చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆదర్శప్రాయుడు బళ్లారి రాఘవ
● కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రశాంతి నిలయం: నాటక రంగ మహానీయుడు బళ్లారి రాఘవ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో బళ్లారి రాఘవ 145వ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ చేతన్ బళ్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, తెలుగు నాటక రంగానికి బళ్లారి రాఘవ చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన నటుడిగానే కాకుండా మేధావిగా, వక్తగా, రచయితగా, దాతగా సమాజ మార్పునకు కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, కలెక్టరేట్ ఏఓ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆ ముగ్గురికీ పింఛన్