
సత్యసాయి శతజయంతి ఉత్సవానికి ప్రాధాన్యం
● రాష్ట్ర పండుగగా గుర్తించిన
తెలంగాణ ప్రభుత్వం
ప్రశాంతి నిలయం: నవంబర్ 23న నిర్వహించనున్న సత్యసాయి శత జయంత్యుత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
రామాలయంలో చోరీ
గోరంట్ల: కరావులపల్లిలోని రామాలయంలో శుక్రవారం రాత్రి చోరి జరిగింది. ఆలయం గేటు, తలుపుల తాళాలను పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు హుండీని సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లి పగులగొట్టి.. అందులోని నగదు ఎత్తుకుపోయారు. రెండు సంవత్సరాల కిందట కూడా ఇదే తరహాలో చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు.
వైద్య సేవలపై ఆరా
గాండ్లపెంట: మండల కేంద్రం గాండ్లపెంటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం శనివారం తనిఖీ చేశారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితులు, మాతాశిశు మరణాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం కటారుపల్లి క్రాస్‌లోని కేజీబీవీని పరిశీలించారు. బాలికల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. కార్యక్రమంలో కదిరి డిప్యూటీ వైద్య ఆరోగ్యశాఖాదికారి నాగేంద్రనాయక్, డాక్టర్లు మహేశ్వర, మారుతి, బాబా ఫక్రుద్దీన్, సూపర్‌వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
క్లర్క్ ఆత్మహత్యాయత్నం
చిలమత్తూరు: టేకులోడు క్రాస్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో క్లర్క్‌గా పనిచేస్తున్న సిద్దలింగప్ప ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. శనివారం సాయంత్రం పురుగులమందు తాగడంతో పాఠశాల సిబ్బంది గమనించి ఆయన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రిన్సిపాల్‌కు సిబ్బందికి మధ్య సఖ్యత లేకపోవడంతో నిరంతర వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే క్లర్క్ మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా.. లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.