
జల్సాల కోసం దొంగతనాలు
రాప్తాడురూరల్: జల్సాలకు అలవాటుపడిన యువకులు అప్పులపాలై.. వాటిని తీర్చుకునేందుకు దొంగలుగా మారి.. చివరకు కటకటాలపాలయ్యారు. ఇటీవల అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాల డెయిరీలో రూ.10 లక్షల విలువైన జనరేటర్, 70 అల్యూమినియం పాల క్యాన్లను చోరీ చేసిన కేసులో నిందితులను అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రూరల్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శేఖర్ వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో అనంతపురంలోని రంగస్వామినగర్‌కు చెందిన చిక్కులూరు షెక్షావలి, అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు చెందిన గోవిందు సింహాద్రి, శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం డీఆర్ కాలనీకి చెందిన సి.మనోహర్ ఉన్నారు. చిక్కులూరు షెక్షావలి తపోవనంలో డీజే, లైటింగ్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. తక్కిన ఇద్దరికీ రాచానపల్లి, కొర్రపాడు గ్రామాల్లోని ప్రభుత్వ పాల కేంద్రాల్లో సూపర్‌వైజర్లుగా పని చేశారు. ప్రస్తుతం ఆ రెండు పాలకేంద్రాలు మూతపడడంతో పనిలేక అప్పులు చేసుకున్నారు. షెక్షావలికి జనరేటర్ అవసరం ఉందని తెలుసుకుని రాచానపల్లిలో మూతపడిన పాలకేంద్రంలోని జనరేటర్, అల్యూమినియం పాలక్యాన్లను ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత నెల 14న రాత్రి రెండు వాహనాల్లో వెళ్లి పాలడెయిరీ భవనం తాళాలు పగులగొట్టి జనరేటర్, పాలక్యాన్లను ఎత్తుకెళ్లారు.
అరెస్ట్ ఇలా...
రాచానపల్లి ప్రభుత్వ పాలడెయిరీ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ జగదీష్ ఉత్తర్వుల మేరకు రూరల్ డీఎస్పీ వెంకటేశులు పర్యవేక్షణలో సీఐ శేఖర్‌కు వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ కె.రాంబాబు, సిబ్బందితో తపోవనం సమీపంలోని పెట్రోలుబంకు వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను చాకచక్యంగా పట్టుకుని కేసును ఛేదించిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్
జనరేటర్, పాలక్యాన్లు స్వాధీనం