
వీఆర్వోల వీరంగం
రొళ్ల: మద్యం మత్తులో ఇద్దరు వీఆర్వోలు వీరంగం సృష్టించారు. మాజీ ప్రజాప్రతినిధితో పాటు స్థానికులపై దురుసుగా ప్రవర్తించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రొళ్లకొండ గ్రామ సమీపాన 544ఈ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన టోల్‌గేట్ వద్ద గురువారం సాయంత్రం రత్నగిరి వీఆర్వో నాగరాజు, గుడ్డగుర్కి వీఆర్వో రంగనాథ్ ఇద్దరు పూటుగా మద్యం తాగారు. టోల్‌గేట్ వద్ద ఉన్న ఓ టీ బంక్ వద్దకు వచ్చి.. అక్కడే ఉన్న రత్నగిరి చెందిన మాజీ ఎంపీపీ క్రిష్ణప్ప, మరో ఐదారుగురిని అసభ్య పదజాలంతో దూషించారు. గ్రామస్థాయి అధికారులై అయి ఉండి ఇలా ప్రవర్తించడం సరికాదని స్థానికులు హెచ్చరిస్తున్నా వారు వినలేని పరిస్థితి. నిలబడలేని స్థితిలో తూగుతూ, కళ్లు పెద్దవిగా చేస్తూ రెచ్చిపోయారు. ఈ తతంగాన్ని స్థానికులు కొందరు సెల్‌ఫోన్‌లో చిత్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న రొళ్ల తహసీల్దార్ షేక్షావలి సదరు వీఆర్వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇద్దరినీ పెనుకొండ ఆర్డీఓ కార్యాలయానికి సరెండర్ (అప్పగించారు) చేశారు.
మాజీ ఎంపీపీతోపాటు
మరికొంతమందిపై దురుసు ప్రవర్తన