
శ్రావణ శనివారం.. అద్వితీయం
పావగడ: శ్రావణ మాస రెండో శనివారం పావగడ శనీశ్వరస్వామి స్వర్ణ దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రధాన అర్చకులు అనంతరాం భట్, కృష్ణ శాస్త్రి నేతృత్వంలో ఉదయం 4 గంటలకే శనీశ్వర స్వామికి పంచామృతాభిషేక, తైలాభిషేక, నవగ్రహ పూజలు జరిగాయి. భక్తులు తైలాభిషేక పూజల్లో లీనమైపోయారు. శనీశ్వరునికి ఇష్టమైన నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల వస్త్రాలు సమర్పించారు. ఆలయం వెలుపల టెంకాయలు కొట్టారు. దీక్షా మంటపంలో తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తులాభారంలో తమకు తోచిన నిలువెత్తు కానుకలు సమర్పించుకున్నారు. ఎలాంటి శని దోషాలు లేకుండా తమను కాపాడాలని వేడుకున్నారు. ఆలయ సమితి అధ్యక్షుడు అనిల్ కుమార్ తదితర పదాధికారుల పర్యవేక్షణలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దైవ దర్శనం సులభంగా జరిగేలా చర్యలు చేపట్టారు. శనీశ్వరు డిని దర్శించుకుని పూజలు నిర్వహించిన భక్తులు ఆనవాయితీగా సమీపంలోని కోటె ఆంజనేయస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.

శ్రావణ శనివారం.. అద్వితీయం