
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై.. టీడీపీ వర్గీయుల దాడి
తాడిమర్రి: పొలం వివాదంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మాల్యవంతం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సద్దల శివయ్య, అతని కుమారుడు సద్దల చిన్న కేశవయ్య శనివారం సాయంత్రం జొన్నచొప్పకు నీరు పెడుతున్నారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సద్దల కేశవయ్య, సద్దల శీనప్ప మరికొందరు వ్యక్తులు శివయ్య జొన్నచొప్పలో వెళుతున్నారు. దీంతో శివయ్య కుమారుడు చిన్న కేశవయ్య పొలంలో వెళ్లరాదని అభ్యంతరం తెలిపారు. కోపోద్రిక్తులైన టీడీపీ కార్యకర్తలు... చిన్న కేశవయ్యపై దాడికి దిగారు. అడ్డు వచ్చిన శివయ్యపైనా దాడి చేశారు. గాయపడిన శివయ్య, చిన్న కేశవయ్యలను బంధువులు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు రెఫర్ చేశారు. ఈ విషయంపై ఎస్‌ఐ కృష్ణవేణిని వివరణ కోరగా ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలిసిందన్నారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ బత్తలపల్లి మండల మాజీ కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి ఆర్డీటీ ఆస్పత్రికి వెళ్లి బాధితులు శివయ్య, చిన్న కేశవయ్యలను పరామర్శించారు.