
అప్పులబాధతో మహిళ ఆత్మహత్య
అమరాపురం: ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆలదపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి తనయుడు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆలదపల్లికి చెందిన వీరభద్రప్ప 20 ఏళ్ల క్రితం ఇంట్లోనే కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని చనిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కుటుంబ సభ్యులు ఆ ఇంటిని పడగొట్టి.. కొత్తగా కట్టించారు. ఇందు కోసం మహిళా సంఘం, బ్యాంకు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.4 లక్షల దాకా అప్పులు చేశారు. కొన్నాళ్ల తర్వాత అప్పులు తీర్చడానికి పని కోసం వీరభద్రప్ప కుమారుడు ఈరన్న బెంగళూరుకు వలస వెళ్లాడు. అయినా ఆ సంపాదన కుటుంబ పోషణకే సరిపోయింది. దీంతో అప్పులు తీర్చాలని ఒత్తిళ్లు పెరగడంతో వీరభద్రప్ప భార్య కెంచమ్మ (59) బాధపడుతుండేది. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెందిన కెంచమ్మ శనివారం తెల్లవారుజామున ఇంటి సమీపంలో ఉన్న పొలం వద్ద చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న ఏఎస్‌ఐ రామాంజనేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి కుమారుడు ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అదును చూసి నగదు కాజేసి..
కదిరి టౌన్: ద్విచక్రవాహనం డిక్కీలో ఉంచిన నగదును ఇద్దరు దుండగులు అదును చూసి అపహరించుకుపోయారు. ఈ ఘటన కదిరిలో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కుటాగుళ్లకు చెందిన చింతపండు వ్యాపారి ఇమామ్‌ఖాన్ తన కుమారుడు సమీర్‌ఖాన్‌తో కలిసి శనివారం ఐశ్వర్య హోటల్ ఎదుట నున్న కరూర్ వైశ్య బ్యాంక్‌కు వెళ్లి రూ.70వేలు డ్రా చేశారు. అనంతరం నగదును ద్విచక్రవాహనం డిక్కీలో భద్రపరచి బయల్దేరారు. మదనపల్లి రోడ్డులో మోర్ పక్కన మెకానిక్ షాప్ వద్ద బండి ఆపారు. షాపు వద్దకు వెళ్లి పని చూసుకుని తిరిగి వచ్చారు. డిక్కీ తెరిచి చూడగా డబ్బు కనిపించలేదు. ఎవరో చోరీ చేశారని గ్రహించిన ఇమామ్‌ఖాన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ వి.నారాయణరెడ్డి సీసీ కెమెరాలు పరిశీలించగా.. టోపీలు ధరించి, నంబరు ప్లేటు లేని బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనాన్ని అనుసరిస్తూ వచ్చారు. మెకానిక్ షాపు వద్ద ద్విచక్రవాహనదారులు వెళ్లగా.. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు డిక్కీలోని నగదును ఎత్తుకుని వెళ్లిపోయినట్లు గుర్తించారు. సదరు వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని సీఐ సూచించారు.
మద్యం కేసులో ముద్దాయికి జైలు
పుట్టపర్తి టౌన్: కర్ణాటక మద్యం తరలించిన కేసులో ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.4,391 జరిమానా విధిస్తూ పుట్టపర్తి సివిల్ జడ్జి ముజీబ్ పసపల సయ్యద్ తీర్పు చెప్పారు. పుట్టపర్తి ఎకై ్సజ్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఎనుములపల్లికి చెందిన భూపతి చక్రవర్తి 2021 ఆగస్టులో కర్ణాటక మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. దీంతో పుట్టపర్తి ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఎకై ్సజ్ ఎస్‌ఐ గోపాల్, హెడ్ కానిస్టేబుల్ నాగభూషణం, కానిస్టేబుల్ మహబూబ్‌బాషా కోర్టుకు సాక్ష్యాలను సమర్పించారు. ఈ కేసు శనివారం విచారణకు రాగా, ముద్దాయికి ఆరు నెలల సాధారణ జైలు, రూ.4,391 జరిమానా విధిస్తూ పుట్టపర్తి సివిల్ కోర్టు జడ్జి ముజీబ్ పసపల సయ్యద్ తీర్పు చెప్పారు. ముద్దాయి జరిమానా చెల్లించకపోతే మరో రెండు నెలలు జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

అప్పులబాధతో మహిళ ఆత్మహత్య