
అక్కాతమ్ముడిపై దాడి
రాప్తాడు రూరల్: రస్తా విషయంగా చోటు చేసుకున్న వివాదంలో అక్క, తమ్ముడిపై దాడి చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. సోములదొడ్డి గ్రామానికి చెందిన కె.నారాయణరెడ్డికి కుమారులు కె.రామసుబ్బారెడ్డి, కె.బ్రహ్మానందరెడ్డి, కుమార్తె కమలమ్మ ఉన్నారు. వీరు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే 22 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. వీరి ఇంటి వెనుక నాగిరెడ్డి, రామలక్ష్మి, మదన్‌మోహన్‌రెడ్డి కుటుంబాలు ఉన్నాయి. నారాయణరెడ్డికి చెందిన 22 సెంట్ల స్థలంలో నుంచే ఆ ఇళ్లకు దారి ఉందంటూ ఆ కుటుంబాలు కొద్ది రోజులుగా గొడవ చేస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఖాళీ స్థలంలో పెరిగిన కంపచెట్లన ు తొలిగించేందుకు నాగిరెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి, రామలక్ష్మి, మదన్‌మోహన్‌రెడ్డి తదితరులు కొడవళ్లు, గొడ్డ్డళ్లతో వెళ్లారు. సమాచారం అందుకున్న నారాయణరెడ్డి కుమారులు రామసుబ్బారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కమలమ్మ వెళ్లి అడ్డుకున్నారు. తమ స్థలంలో ఎందుకు చెట్లు తొలగిస్తున్నారంటూ ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది. ఆ స్థలం తమదంటూ మారణాయుధాలతో నాగిరెడ్డి కుటుంబసభ్యులు దాడికి పాల్పడ్డారు. గొడ్డలితో దాడి చేయడంతో కమలమ్మ, బ్రహ్మానందరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. రామసుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఇంతలో గ్రామస్తులు జోక్యం చేసుకుని సర్దిచెప్పి పంపారు. గాయాలపాలైన కమలమ్మ, బ్రహ్మానందరెడ్డి, రామసుబ్బారెడ్డిని సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యూరోప్ భక్తుల సంగీత కచేరీ
ప్రశాంతి నిలయం: పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన యూరప్, యూకేలోని సత్యసాయి భక్తులు శుక్రవారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత సంగీత కచేరీ నిర్వహించి అలరించారు. సుమారు గంట పాటు భక్తిగీతాలతో వారు నిర్వహించిన కచేరీ భక్తులు మైమరచిపోయారు.