అది ప్రమాదం కాదు.. హత్యే | - | Sakshi
Sakshi News home page

అది ప్రమాదం కాదు.. హత్యే

Aug 1 2025 12:33 PM | Updated on Aug 1 2025 12:33 PM

అది ప్రమాదం కాదు.. హత్యే

అది ప్రమాదం కాదు.. హత్యే

వ్యక్తి హత్య కేసులో వీడిన మిస్టరీ

భార్యనే సూత్రధారి

కుమారుడు, అక్క కుమారుడితో కలసి కుట్ర

నిందితుల అరెస్ట్‌

గార్లదిన్నె: గత నెల కారు ఢీకొని రైతు మృతి చెందిన కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. అది ప్రమాదం కాదని, పథకం ప్రకారం కుటుంబసభ్యులే హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు నిర్ధారించి ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. గార్లదినెన్న పీఎస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ వెంకటేశులు వెల్లడించారు.

గార్లదిన్నె మండలం జంబులదిన్నె గ్రామానికి చెందిన బోయ నల్లప్ప (50)కు 30 ఏళ్ల క్రితం శింగనమల మండలం కల్లుమడి గ్రామానికి చెందిన లక్ష్మితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 25 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం నల్లప్ప తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం మల్రెడ్డిపల్లి సమీపంలో ఉన్న క్వారీలో పని చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న ఓ మహిళతో సన్నిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆర్థిక సాయం అందిస్తూ ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయం తెలిసి భార్య సర్దిచెప్పేందుకు ప్రయత్నించింది. అయితే భార్యకు విడాకులు ఇచ్చేందుకై నా సిద్ధమని, ఆ మహిళను మాత్రం తాను వీడి ఉండలేనని నల్లప్ప స్పష్టం చేయడంతో మనస్పర్తలు చెలరేగి ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం లక్ష్మి తన పిల్లలతో కలసి కల్లూరు నివాసముంటోంది. నల్లప్ప అనంతపురం సమీపంలోని సోములదొడ్డిలో ఒంటరిగా ఉంటూ రోజూ ద్విచక్ర వాహనంపై ఓబులాపురం వద్ద ఉన్న తోటకు వచ్చి వెళ్లేవాడు. అప్పుడప్పుడు తెలంగాణలో ఉంటున్న మహిళ వద్దకెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆస్తి కూడా ఆమె పేరునే రాసిస్తాడనే అనుమానాలు వ్యక్తం కావడంతో భార్య లక్ష్మి ఆందోళనకు గురైంది. దీంతో పిల్లలకు ఆస్తి దక్కాలనే ఆలోచనతో ఎలాగైనా భర్తను హతమార్చాలని నిర్ణయించుకున్న ఆమె... తన కుమారుడు ఆశ్రయ్‌, పెద్దవడుగూరు మండలం చిత్రచేడులో ఉంటున్న అక్క కుమారుడు శ్రీకాంత్‌ కలసి నల్లప్ప హత్యకు పథకం రచించారు. పథకంలో భాగంగా జూలై 23న నల్లప్ప ద్విచక్ర వాహనంపై వ్యవసాయ తోట వద్ద నుంచి తిరిగి వస్తుండగా జంబులదిన్నె కొట్టాల సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి ఇన్నోవా కారుతో ఢీకొని హతమార్చారు. హత్యకు ఉపయోగించిన కారును అద్దెకు తీసుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. అయితే తొలుత ప్రమాదంలో రైతు మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా భార్య, కుమారుడిని విచారణ చేయడంతో అసలు నిజం వెలుగు చూసింది. దీంతో లక్ష్మి, ఆమె కుమారుడు ఆశ్రయ్‌, అక్క కుమారుడు శ్రీకాంత్‌ని గురువారం అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సీఐ కౌలట్లయ్య, ఎస్‌ఐ గౌస్‌ మహమ్మద్‌ బాషా, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement