1,300 ఓటర్లు మించితే కొత్త పోలింగ్‌ కేంద్రం | - | Sakshi
Sakshi News home page

1,300 ఓటర్లు మించితే కొత్త పోలింగ్‌ కేంద్రం

Mar 21 2025 1:41 AM | Updated on Mar 21 2025 1:36 AM

హిందూపురం: పోలింగ్‌ కేంద్రంలో 1,300కు మించి ఓటర్లు ఉంటే దానిని విభజించి కొత్త కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఓటరు నమోదు అధికారి, జేసీ అభిషేక్‌కుమార్‌ తెలిపారు. ‘ఓటరు జాబితా సవరణ – నూతన పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు’ అంశంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు హిందూపురంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయన అవగాహన కల్పించారు. పోలింగ్‌ కేంద్రాల విభజనపై చర్చించారు. ప్రతి ట్రాన్స్‌జెండర్‌నూ ఓటరుగా నమోదు చేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛందంగా ప్రతి ఓటరు తన ఆధార్‌ నంబర్‌ను ఎపిక్‌ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని కోరారు. రాజకీయ పార్టీ నాయకులు కూడా ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ తహసీల్దార్‌లు జి.వెంకటేష్‌, జి.సౌజన్యలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ సి.శ్రీనివాసులు, డీటీ మైనుద్దీన్‌, ఎన్నికల సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్‌ఐ అమరేంద్ర, ఎన్నికల, రెవెన్యూ సిబ్బంది, ఎలక్షన్‌ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

ఎస్కేయూలో కొనసాగుతున్న గ్యాంగ్‌వార్‌

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో గ్యాంగ్‌ వార్‌ పరంపర కొనసాగుతోంది. ఆధిపత్య పోరులో విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి బాహాబాహీకి తలపడుతున్నారు. రెండు రోజుల క్రితం క్యాంపస్‌లోని ఫార్మసీ విద్యార్థుల మధ్య గ్యాంగ్‌ వార్‌ ఘటనను మరువకనే బుధవారం రాత్రి మరోసారి ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ విద్యార్థులు కొట్టుకున్నారు. వివరాలు... బుధవారం రాత్రి ఎంబీఏ హాస్టల్‌ వద్దకు ఎల్‌ఎల్‌బీ ఫైనలియర్‌ విద్యార్థి వెళ్లడంతో ఇక్కడ నీకేం పని అంటూ అక్కడే ఉన్న ఎంబీఏ ఫైనలియర్‌ విద్యార్థులు నిలదీశారు. దీంతో వారి మధ్య మాటామాట పెరిగింది. దీంతో వ్యక్తిగత ప్రతిష్టకు పోయిన ఎల్‌ఎల్‌బీ విద్యార్థి వెంటనే తన స్నేహితులకు ఫోన్‌ చేసి ఎంత మంది ఉంటే అంత మంది ఎంబీఏ హాస్టల్‌ వద్దకు చేరుకోవాలన్నాడు. దీంతో ద్విచక్ర వాహనాలపై అక్కడకు చేరుకున్న ఎల్‌ఎల్‌బీ విద్యార్థులకు, అక్కడే ఉన్న ఎంబీఏ విద్యార్థులు బాహాబాహీకి దిగారు. పరస్పర భౌతిక దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎంబీఏ విద్యార్థి చేతికి, లా విద్యార్థి కన్నుకు గాయాలయ్యాయి. ఘటనపై క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు ఏడుగురు ఎంబీఏ విద్యార్థులు, పది మంది ఎల్‌ఎల్‌బీ విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు ఇటుకలపల్లి పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement