
సాయి మహిమ.. సర్వులకూ రక్ష
ప్రశాంతి నిలయం: భగవాన్ సత్యసాయిబాబా నెలకొల్పిన వైద్యశాలల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను కళ్లకు కడుతూ తమిళనాడు భక్తులు ‘సాయి మహిమ’ పేరుతో ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో సత్యసాయి సన్నిధిలో అలరిస్తున్నారు. రెండో రోజు ఆదివారం ఉదయం తమిళనాడు బాలవికాస్ చిన్నారులు దేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలపై నృత్య ప్రదర్శన ఇచ్చారు. తర్వాత చక్కటి భక్తిగీతాలతో సంగీత కచేరి నిర్వహించారు. సాయంత్రం ‘సాయి మహిమ’ పేరుతో తమిళనాడు సత్యసాయి యూత్ చక్కటి సందేశాత్మక నాటిక ప్రదర్శించారు. సత్యసాయి వైద్య సంస్థలలో కుల, మతాలకు అతీతంగా రోగులకు కార్పొరేట్ తరహా వైద్యం ఉచితంగా అందుతున్న తీరును చక్కగా వివరించారు.