
ఈత చెట్టుకు కుండ ఏర్పాటు చేస్తున్న గీత కార్మికుడు
కదిరి: ఈత చెట్ల నుంచి సహజ సిద్ధంగా లభించే నీరా, దాని ఉత్పత్తులకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీ కేఫ్‌ల్లా పలు చోట్ల నీరా కేఫ్‌లు వెలిశాయి. ఇది ఎన్నో వ్యాధులను నివారించే ఆరోగ్య ద్రావకమని ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రామాల్లోనే కాకుండా పట్టణాలు, నగరాల్లో కూడా తట్టు, ఆటలమ్మ, కామెర్లు వంటి వ్యాధులకు గురైన వారికి నీరా తాగించాలని పెద్దలు సూచిస్తుంటారు. అజీర్తి, గ్యాస్, మలబద్దకం లాంటి సమస్యలు దూరమవుతాయని పేర్కొంటున్నారు.
విస్తారంగా ఈత చెట్లు
శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి, గోరంట్ల, హిందూపురం, చిలమత్తూరు, పెనుకొండ, బత్తలపల్లి, మడకశిర, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు తదితర ప్రాంతాల్లో తాటి చెట్లతో పాటు ఈత చెట్లూ విస్తారంగా ఉన్నాయి. ప్రభుత్వ బంజరు భూములతో పాటు కొందరు రైతులు సైతం ఈత చెట్లను పెంచుతున్నారు. తాటి చెట్ల నుంచి కూడా నీరా లభిస్తుంది కానీ, ఈత నీరాలోనే అత్యధిక ఔషధ గుణాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
ఎన్నో రకాల మినరల్స్
ప్రతి 100 మిల్లీలీటర్ల నీరాలో 264 కేసీఎల్ ప్రొటీన్, పిండిపదార్థాలు, సున్నా శాతం కొవ్వు, లవణాలు, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాల్షియం, సోడియం, పొటాషియం ఉన్నాయి. ఎస్మార్టీస్ ఆసిడ్, నికోటిన్, రీబోఫ్లోవిన్ లాంటి విటమిన్స్, ఆరోగ్యానికి మేలు చేసే మాంసకృత్తులు ఇతర పోషకాలు ఎన్నో నీరాలో ఉన్నాయి. దీనిని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది ప్రకృతి సిద్ధమైన సహజ పానీయం కాబట్టి ఎవరైనా తాగవచ్చునంటున్నారు. ఇందులో సుక్రోజ్ ఉండడం వల్ల డయాబెటీస్ ఉన్నవారు, చిన్నపిల్లలు, గర్భిణులు కూడా సేవించవచ్చునని సూచిస్తున్నారు.
ఔషధ గుణాలు మెండు..
● మలబద్దకం, గ్యాస్ దూరం అవుతాయి.
● సుక్రోస్, ప్రొటీన్స్ సహజసిద్ధమైన తీపితోపాటు శక్తిని ఇస్తాయి.
● కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
● లివర్ సంబంధిత వ్యాధులకు నివారిణిగా పనిచేస్తుంది.
● కామెర్లు, ఫ్యాటీ లివర్, లివరోసిస్ నుంచి నీరా కాపాడుతుంది. గుండె పనిచేసే విధానాన్ని మెరుగుపరుస్తుంది.
● కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది. వచ్చిన రాళ్లను కరిగిస్తుంది.
● క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
● దీనిలో ఉండే మినరల్స్ రక్తకణాలను వృద్ధి చేస్తాయి.
● ముఖ్యంగా నీరా తాగితే ఫ్లొరోసిస్ తీవ్రత తగ్గుతుంది.
● ఆయుర్వేదంలో వాడుతారు.
● ఆల్కాహాల్ శాతం తక్కువగా ఉంటుంది.

ఈత నీరాను బాటిల్‌లో నింపుతున్న గీత కార్మికుడు చంద్రశేఖర్