● ధ్వజమెత్తిన మాజీ మంత్రి
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
● జిల్లా వ్యవసాయ కార్యాలయం
ఎదుట ధర్నా
నెల్లూరు(వేదాయపాళెం): వరి సాగుపై ఆధారపడిన అన్నదాతకు తీరని అన్యాయం చేసేందుకు సైతం చంద్రబాబు జమానా వెనుకాడటంలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. రైతులకు సరిపడా యూరియాను ఇవ్వాలనే డిమాండ్‌తో నగరంలోని జిల్లా వ్యవసాయ కార్యాలయ ఎదుట శుక్రవారం చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ విధానంతో కౌలు రైతులు తీవ్ర అవస్థలు పడుతూ, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలిపారు. భూ యజమాని అమెరికాలోనో లేదా ఇతర దేశాల్లో ఉంటే ఓటీపీ వారికే వెళ్తుందని, తిరిగి వారు దాన్ని తెలియజేయాలంటే ఇక్కడ రాత్రవుతోందని పేర్కొన్నారు. దీన్ని చెప్తే గానీ యూరియాను ఇవ్వకపోవడంతో కౌలు రైతులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. యూరియాను ఎగ్గొట్టేందుకు సర్కార్ యత్నించిందని, తమ పార్టీ పోరాటాల ఫలితంగా ప్రస్తుతం మూడు బస్తాల మేర ఇచ్చేందుకు దిగొచ్చిందని చెప్పారు. వరి పంటను నిర్వీర్యం చేసేందుకు సర్కార్ యత్నిస్తోందని మండిపడ్డారు. సంప్రదాయ పంటలు, ఆహార అలవాట్లను సైతం మార్చేసి ప్రజల జీవన విధానాన్నే శాసిస్తున్నారని విమర్శించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను మార్చేస్తామని చెప్పినందుకు గానూ శ్రీలంకలో అక్కడి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టారని, ఇక్కడ చంద్రబాబు సర్కార్‌కు సైతం ఇదే జరుగుతుందని చెప్పారు. వరి సాగును తగ్గించి ఆ భూములను పరిశ్రమల పేరుతో తక్కువ ధరలకు తమ అనుచరులకు కట్టబెట్టే యత్నంలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఏడీకి వినతిపత్రమిస్తున్న కాకాణి, కిలివేటి, ఆనం తదితరులు
నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు


