వెంకటాచలం: రెండు మండలాలకు సాగు, తాగునీరు అందించాల్సిన ప్రధానమైన సర్వేపల్లి రిజర్వాయర్ ఆక్రమణలకు గురవుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రిజర్వాయర్ భూముల్లో సాగు చేసుకునేందుకు ఏకంగా నీటినే అక్రమంగా తరలించేందుకు కాలువలు తవ్వుతున్న పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రిజర్వాయర్ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తమవుతోంది.
రెండు మండలాలకు ఆధారం
వెంకటాచలం, ముత్తుకూరు మండలాలకు సాగు, తాగునీరు అందించడంలో సర్వేపల్లి రిజర్వాయర్ కీలకంగా ఉంది. ఇక్కడి నుంచి ఆ రెండు మండలాల్లోని 64 గ్రామాలకు తాగునీరు, 15,300 ఎకరాలకు అధికారికంగా, అనధికారికంగా కలిపి సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. రిజర్వాయర్ విస్తీర్ణం 15 వేల ఎకరాలు కాగా.. ఏటా పైభాగంలో జరుగుతున్న ఆక్రమణలతో విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. చుట్టూ ఉన్న గ్రామాల్లోని ఆక్రమిత భూముల్లో ఆక్రమణదారులు వరి సాగు చేస్తున్నారు.
ఫిర్యాదులు చేసినా..
రిజర్వాయర్ భూముల ఆక్రమణలపై ఆయకట్టు రైతులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు కనిపించడం లేదు. 2011లో ఆక్రమణలపై సర్వే నిర్వహించారు. అప్పట్లో 300 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురై వరి సాగు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఆక్రమణదారులకు నోటీసులిచ్చి వదిలేశారు. ఆ తర్వాత నుంచి నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం100 నుంచి 150 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురై ఉంటుందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమ్మకాలు సాగిస్తూ..
సర్వేపల్లి రిజర్వాయర్‌ను ఆక్రమించి సాగు చేసుకుంటున్న భూములు చేతులు మారుతున్నాయి. అనికేపల్లి, గొలగమూడి, కంటేపల్లి, జోసఫ్‌పేట తదితర గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు కొన్నేళ్లుగా రిజర్వాయర్ భూముల్లో అక్రమ సాగు చేస్తున్నారు. యంత్రాలతో చుట్టూ గట్లు వేయించి, మోటార్ల ద్వారా రిజర్వాయర్ నీటినే తరలిస్తున్నారు. దీంతో ఎకరాకు నాలుగు పుట్లకు తగ్గకుండా దిగుబడి వస్తుండటంతో సెంటు భూమి లేని కొందరు వ్యక్తులు ఈ భూములను ఎకరా రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు కొనుగోలు చేసి సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. కొంతమంది ఆక్రమిత భూములకు సాగునీరు అందించేందుకు రిజర్వాయర్ మధ్యలో నుంచే ఇష్టారాజ్యంగా కాలువలు తవ్వుతున్నారు.
అధికారులు చూస్తే కదా..
ఆక్రమణలు పెరుగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అనికేపల్లి, గొలగమూడి గ్రామాల పరిధిలోని రిజర్వాయర్ ప్రాంతంలో ఏటా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆక్రమిత భూముల కారణంగా ఆయకట్టు పొలాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ మధ్యలో నుంచే యంత్రాలతో కాలువలు తవ్వుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రిజర్వాయర్ ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వివరణ కోసం సర్వేపల్లి రిజర్వాయర్ డీఈ అనిల్‌కుమార్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.
సర్వేపల్లి రిజర్వాయర్‌లో
ఏటా పెరుగుతున్న ఆక్రమణలు
చేతులు మారుతున్న ఆక్రమిత భూములు
పట్టించుకోని అధికారులు
ఇష్టారాజ్యంగా సాగు


