ఇసుక టిప్పర్‌ మాయం | - | Sakshi
Sakshi News home page

ఇసుక టిప్పర్‌ మాయం

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: కొంతకాలంగా నకిలీ బిల్లులతో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్న సైదాపురం మండల అధికార పార్టీ నాయకుడి టిప్పర్‌ను పొదలకూరు పోలీసులు పట్టుకున్నారు. అయితే అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఫోన్‌ కాల్‌తో దానిని వదిలివేసిన వైనం గురువారం చోటుచేసుకుంది. కలువాయి మండలం రాజుపాళెం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న నాయకుడి వ్యవహారం, టిప్పర్‌ను వదిలిలేసిన సమాచారం తెలుసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. వెంకటగిరి ముఖ్యనేత పేరును అడ్డుపెట్టుకుని ఇసుకను తరలిస్తున్న సైదాపురం నాయకుడి టిప్పర్‌పై మైనింగ్‌ జిల్లా అధికారి నెల్లూరు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో గతేడాది ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం.

అధికారం ఉందని..

నకిలీ బిల్లులతో కొంతకాలంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను వదిలివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారం ఉందని ఏమైనా చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇసుక మాఫియా పటిష్టంగా ఉన్నందున గంటల వ్యవధిలోనే టిప్పర్‌ను స్టేషన్‌ వెలుపల లేకుండా చేశారు. ఈ ఘటనపై పెద్ద చర్చ జరుగుతున్నట్టు సమాచారం. రెండు నియోజకవర్గాల పరిధిలో ఘటన జరగడంతో ప్రజాప్రతినిధుల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. తన నియోజకవర్గంలో నకిలీ బిల్లులతో వెళ్తున్న ఇసుక టిప్పర్‌ను పట్టుకుని వదిలివేయడం ఏమిటని పోలీసులను సోమిరెడ్డి నిలదీసి వెంటనే కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే వదిలివేసిన టిప్పర్‌ తిరిగి తీసుకురావాలంటే పోలీసులకు సమస్యగా మారుతుందనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ తీసుకొచ్చినా వెంకటగిరి ముఖ్యనేత సమ్మతించకుంటే పంచాయితీ పెద్దది అవుతుందనే ప్రచారం ఉంది.

నకిలీ బిల్లులతో వెళ్తుండగా

పట్టుకున్న పోలీసులు

అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఫోన్‌ కాల్‌

గతంలో ఆ వాహనంపై మైనింగ్‌ అధికారి ఫిర్యాదు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement