● ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
ఫలితాల విడుదల
నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో ఆరు.. సెకండియర్‌లో నాలుగో స్థానాన్ని జిల్లా సాధించింది. ఫస్టియర్‌కు సంబంధించి 4756 మంది హాజరుకాగా., వీరిలో 1998 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 42 శాతంగా నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 4358 మందికి గానూ 2788 మంది పాసయ్యారు. ఇందులో పాస్ పర్సంటేజీ 64 శాతంగా ఉంది.
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు..
ఫలితాలకు సంబంధించిన రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్‌లో సబ్జెకుకు రూ.260.. రీ వెరిఫికేషన్లో సబ్జెక్ట్‌కు రూ.1300 మేర ఫీజును ఆన్‌లైన్లో చెల్లించాల్సి ఉంది.
బీసీల పరిస్థితులపై
సమగ్ర అధ్యయనం
నెల్లూరు రూరల్: బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనాన్ని నిర్వహించి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి గురువారం నిర్వహించారు. జిల్లాలోని బీసీల జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. గణాంకాలు, రికార్డులను సమగ్రంగా సిద్ధం చేసి కమిషన్‌కు అందజేయాలని సూచించారు. అనంతరం వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, నేతల నుంచి వినతిపత్రాలను స్వీక రించారు. డీఆర్వో విజయకుమార్, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మమ్మ, డీపీఓ వసుమతి, డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ నుంచి ఆరుగురు
ఎంపీటీసీల సస్పెన్షన్
కోట: మండలానికి చెందిన ఆరుగురు ఎంపీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులను విడుదల చేశారు. ఎంబేటి శశి (వంజివాక), మండి శివరావమ్మ (గూడలి – 2), మొబీన్‌బాషా (కోట – 2), కర్లపూడి సుబ్రహ్మణ్యం (తిన్నెలపూడి), దాసరి పోలమ్మ (సిద్ధవరం), ఎంబేటి హిమబిందు (కొక్కుపాడు)పై సస్పెన్షన్ వేటేశారు. ఈ నెల నాలుగున నిర్వహించిన కోట ఎంపీపీ ఎన్నిక సందర్భంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వీరిని సస్పెండ్ చేశారు.
గస్తీ బోటు రాకతో
తమిళ జాలర్ల పరార్
వాకాడు: అక్రమ వేటను నివారించేందుకు సముద్రంపై గస్తీ తిరుగుతున్న అధికారుల బోటు సైరన్‌ను వాకాడు మండలం తూపిలిపాళెం తీరంలో మోగించడంతో తమళ జాలర్లు పరారయ్యారు. తూపిలిపాళెం తీరం వద్ద వేటను అక్రమంగా సాగిస్తున్న క్రమంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మైరెన్, మత్స్యశాఖ అధికారుల బోటు ఉనికిని పసిగట్టిన వీరు తమ ఖరీదైన వలను కత్తులతో కోసి అక్కడే వదిలేసి పరారయ్యారు. అధికారులు వెంబడించినా, పలాయనం చిత్తగించారు.
నిరీక్షణ..
చివరికి వాయిదా
సైదాపురం: అధికారులు గంట తరబడి నిరీక్షించారు. చివరికి కోరం లేక మండల సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని ఎంపీడీఓ ప్రకటించారు. సైదాపురం మండల సర్వసభ్య సమావేశాన్ని గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించాల్సి ఉంది. మండల, గ్రామ స్థాయి అధికారులు హాజరై సభ్యుల కోసం నిరీక్షించారు. అయితే ఎంపీపీ పలుగొటి పెంచలమ్మ, ఊటుకూరు, పాలూరు ఎంపీటీసీలు తిరకాల భాస్కర్, ఈశ్వరరాజు మాత్రమే హాజరయ్యారు. తమకు నిధులను కేటాయించడంలో పక్షపాత ధోరణిని పాటించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి సమావేశాన్ని వాయిదా వేశారు.


