సర్‌దాగా మార్చేశారు..! | - | Sakshi
Sakshi News home page

సర్‌దాగా మార్చేశారు..!

Jun 19 2026 1:06 AM | Updated on Jun 19 2026 1:06 AM

అధికార పార్టీ బీఎల్‌ఏలుగా క్షేత్ర సహాయకులు

ప్రభుత్వం నుంచి గౌరవవేతనం పొందుతూ..

విషయం తెలిసినా,

మౌనం వహిస్తున్న అధికారులు

ప్రక్రియ సజావుగా సాగడంపై అనుమానాలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్‌ ప్రక్రియను టీడీపీ నేతలు అస్తవ్యస్తంగా మార్చారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న పలువురు క్షేత్ర సహాయకులు, అక్రిడిటేషన్‌ పొందిన కొందరు మీడియా ప్రతినిధులు సైతం అధికార పార్టీ బూత్‌ స్థాయి ఏజెంట్లుగా (బీఎల్‌ఏ) రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో అధికార పార్టీకి అనుకూలంగా ఓట్ల నమోదు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారివి తొలగించే కుట్రలో భాగస్వాములవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామస్థాయిలో అత్యంత కీలకంగా ఉన్న ఉపాధి హామీ ఎఫ్‌ఏలు ఇందులో చేరడం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది.

ఏం జరుగుతోంది..?

ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు అత్యంత కీలకం. ఈ వ్యవస్థను అనేక సార్లు అపహాస్యం చేసిన చంద్రబాబు.. ప్రతిపక్ష ఓట్లను తొలగించే వ్యవహారానికి శ్రీకారం చుట్టారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సర్‌ ప్రక్రియలో పచ్చ పార్టీ కార్యకర్తలు చొరబడి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే బీఎల్‌ఓలను తమ గుప్పెట్లో పెట్టుకొని.. ప్రతిపక్ష పార్టీల బీఎల్‌ఏలకు సమాచారమివ్వకుండానే ఎన్యూమరేషన్‌ ఫారాలను ఇష్టానుసారంగా పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో తమకు వ్యతిరేకంగా ఓట్లు పడే కుటుంబాల్లో కొన్నింటిని తొలగించే కుతంత్రాన్ని పన్నుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారనే సాకుతో ఓట్ల సంఖ్యను తగ్గించే కుట్రకు పదును పెడుతున్నారనే మాట టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. కాలనీల్లోని ప్రతి కుటుంబంపై పూర్తి అవగాహన ఉండి. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న క్షేత్ర సహాయకులు, వెలుగు వీఓఏలను ఉపయోగించి తమకు అనుకూలంగా లేని ఓట్లను తొలగించే దుస్సాహసానికి తెరలేపారనే అంశం తాజా పరిణామాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement