నెల్లూరు (టౌన్): ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన నీట్‌ను ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్షను మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5.15 వరకు జరపనున్నారు. గత నెల్లో జరిగిన పరీక్ష సమయానికంటే 15 నిమిషాలను అదనంగా పెంచారు. జిల్లా వ్యాప్తంగా 3005 మంది హాజరుకానున్న ఈ టెస్ట్‌ను మొత్తం 12 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. నగరంలోని డీకేడబ్ల్యూ, డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాల, దర్గామిట్టలోని జెడ్పీ బాలుర, బాలికోన్నత పాఠశాలలు, ఏసీనగర్‌లోని మల్లెల సంజీవయ్య మున్సిపల్, స్టోన్‌హౌస్‌పేటలోని ఆరెస్సార్, పప్పులవీధిలోని వైవీఎం మున్సిపల్ హైస్కూల్, గూడూరులోని పాలిటెక్నిక్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, జెడ్పీ బాలికోన్నత పాఠశాలల్లో పరీక్షను జరపనున్నారు.
శ్రీవారి దర్శనానికి
పది గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 82,438 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 39,948 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.24 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి పది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


