నెల్లూరు(బారకాసు): యోగా పోటీల విజేతలకు నెల్లూరు ఎన్‌ఎంసీ కార్యాలయంలోని సీసీసీ భవన సమావేశ మందిరంలో బుధవారం బహుమతులు ప్రదానం చేశారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో పోటీలు ఈనెల 14, 15, 16 తేదీల్లో నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగాయి. విజేతలను మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వైఓ నందన్, డిప్యూటీ డైరక్టర్ మాధురి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్, ఆయుష్ డాక్టర్ ఎ.శారద హెప్సీబా ఘనంగా సత్కరించి బహుమతులను అందజేశారు. మేయర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలు రాజేంద్ర, ప్రసన్నకుమార్, స్వప్న, యోగా అబ్జర్వర్లు రమణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.


