కాపలాదారుడి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

కాపలాదారుడి దారుణ హత్య

Jun 18 2026 12:17 AM | Updated on Jun 18 2026 12:17 AM

ముత్తుకూరు (పొదలకూరు): రొయ్యల గుంతల వద్ద దశాబ్ద కాలంగా కాపలాగా ఉన్న ఓ గిరిజన వృద్ధుడిని గుర్తుతెలియని వారు కర్రలు, కత్తులతో దాడి చేసి హతమార్చారు. మంగళవారం అర్ధరాత్రి వృద్ధుడిని పాశవికంగా హత్య చేయడం చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పొట్టెంపాడు నక్కల కాలువ సమీపంలో పోలంరాజు గుంటకు చెందిన దువ్వూరు సుబ్బరామిరెడ్డి రొయ్యల చెరువుల వద్ద అల్లూరి శేషయ్య (70) పది సంవత్సరాలుగా కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కృష్ణపట్నం సీఐ రఘుబాబు, ఎస్సై కొండారెడ్డి, పోలీస్‌ సిబ్బందితో బుధవారం ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సీఐ వెల్లడించారు. సుబ్బరామిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో

సెక్యూరిటీ గార్డు మృతి

ముత్తుకూరు(పొదలకూరు): కృష్ణపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణపట్నం దళితవాడకు చెందిన దాసరి మహీధర్‌ (33) పంటపాళెంలోని పామాయిల్‌ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తన బావను ఫ్యాక్టరీ వద్ద వదిలిపెట్టి బైక్‌పై బయలుదేరిన మహీధర్‌ తిరిగి ఇంటికి వెళ్లలేదు. అర్ధరాత్రి గోపాలపురం సమీపంలోని తూము వద్ద పొలంలో బైక్‌ లైట్లు వెలుగుతుండటాన్ని గమనించిన స్థానికులు వెళ్లి పరిశీలించగా మహీధర్‌ హెల్మెట్‌తో బోర్లా పడి మృతిచెంది ఉండటాన్ని గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మలుపు వద్ద బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ఆరడుగుల దిగువనున్న పొలంలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగి మృతిచెంది ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేశారు.

పేకాట స్థావరంపై

పోలీసుల దాడులు

నెల్లూరు సిటీ: నెల్లూరులోని ఎన్టీఆర్‌ నగర్‌కు ఎదురుగా చెరకు తోటలో కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారు. బుధవారం రూరల్‌ పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేశారు. ఎనిమిది మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. రూ.5,610 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.

కాలువలో

మృతదేహం లభ్యం

నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్‌ పరిధిలోని కేవీకే కల్యాణ మండపం వద్ద కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు 40 – 45 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. అతను చనిపోయి మూడు రోజులై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement