రైతుల్ని ఆదుకోవడంలో ‘కూటమి’ విఫలం | - | Sakshi
Sakshi News home page

రైతుల్ని ఆదుకోవడంలో ‘కూటమి’ విఫలం

Jun 18 2026 12:17 AM | Updated on Jun 18 2026 12:17 AM

ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఆత్మకూరు: అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు కష్టపడి పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం యూరియా సైతం తగినంత సరఫరా చేయలేక ఏపీఏఐఎంఎస్‌ యాప్‌తో వారిని తీవ్ర గందరగోళానికి గురిచేస్తోందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. యాప్‌ను తీసుకొచ్చి కొత్త విధానం అమలు చేస్తున్నామని బుకాయిస్తూ అన్నదాతలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులు, పట్టాదారు పాస్‌పుస్తకాల్లేని రైతులు, చెరువు లోతట్టు ప్రాంతాల్లో సాగు చేస్తున్న వారికి ఈ ప్రభుత్వం ఎరువులు అందించక పంగనామం పెడుతుందని, దీంతో వారు ఎరువుల దుకాణాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామాల్లో ఆర్‌బీకేలను ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు గుమ్మం ముందుకే చేర్చారన్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో సమృద్ధిగా సాగునీరు ఉన్న క్రమంలో లక్షల ఎకరాల్లో పైర్లు సాగవుతున్న విషయం ప్రభుత్వం ముందుగా గుర్తించక, ఎరువుల సరఫరా చేయడంలో విఫలమవ్వడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం అధికారుల ద్వారా ఎరువుల నిల్వలు పెంచి కొరత లేకుండా యూరియా, డీఏపీ, తదితర ఎరువులను డిమాండ్‌ మేరకు సరఫరా చేయడంలో చొరవచూపాలని కోరారు. కౌలు రైతులకు ప్రత్యేక విధానం ద్వారా ఎరువులు అందజేయాలని, పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్‌ చేశారు. రైతులు మండిపడి రోడ్డెక్కే పరిస్థితులు తీసుకురావ్వొద్దని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement