నెల్లూరు(టౌన్): విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, బ్యాంకింగ్, పరిశోధన లాంటి అనేక రంగాల్లో ఏఐతో విప్లవాత్మక మార్పులు వస్తాయని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల డీన్ గంగినేని ధనుంజయ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్, వైద్య, డిగ్రీ కళాశాలల్లో బోధన, పరిశోధన, మూల్యాంకనం తదితర కార్యకలాపాల్లో ఏఐ ఆధారిత విధానాలను అమలు చేస్తున్నారన్నారు. ఏఐ విద్యావ్యవస్థను పూర్తిగా మార్చగల శక్తిగా అవతరిస్తుందన్నారు. ఏఐ ప్రభావంతో ఉద్యోగ రంగంలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. దివ్యాంగ విద్యార్థుల విద్యా ప్రగతికి ఏఐ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎంబీఏ విద్య ద్వారా ఫైనాన్స్, మార్కెటింగ్, మానవవనరుల నిర్వహణ, కార్యకలాపాల నిర్వహణ, వ్యవస్థాపకత, ప్లేస్‌మెంట్లు తదితర వాటిల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఏఐ ద్వారా పలు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఉన్నత విద్యలో ఏఐను విజయవంతంగా అమలు చేయాలంటే దశల వారీ కార్యచరణ ప్రణాళిక అవసరమన్నారు.
వృద్ధురాలి ఆత్మహత్య
మర్రిపాడు: మండలంలోని అల్లంపాడు గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. డి.కొండమ్మ (75) బుధవారం పురుగు మందు తాగింది. గమనించిన కోడలు ఆమెను వెంటనే ఆత్మకూరు వైద్యశాలకు తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తీసుకెళ్తుండగా కొండమ్మ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొండమ్మకు ఐదుగురు పిల్లలున్నారు.


