యాదవులపై టీడీపీ పైశాచిక ప్రచారం | - | Sakshi
Sakshi News home page

యాదవులపై టీడీపీ పైశాచిక ప్రచారం

Jun 18 2026 12:17 AM | Updated on Jun 18 2026 12:17 AM

కావలి: కావలి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా యాదవ సామాజిక వర్గం రగిలిపోతుంది. కొంత కాలంగా అధికార పార్టీలోని యాదవ సామాజిక వర్గం అణిచివేతకు గురవుతోందని లోలోన మదనపడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉండడంతో అవమానాలు జరుగుతున్నప్పటికీ ఏమీ చేయలేక పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. కొంతమంది అప్పుడప్పుడు బాహాటంగానే తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇటీవల యాదవ సామాజిక వర్గానికి చెందిన మురళీయాదవ్‌ పూర్తిగా అణిచి వేయబడుతూ తీవ్రంగా అవమానాలకు గురి చేస్తుండడంతో దాదాపు 25 ఏళ్ల సుదీర్ఘ టీడీపీతో అనుబంధాన్ని వీడి వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపారు.

బతికున్న మనిషిని చంపేస్తూ పోస్టులు

కావలికి చెందిన చిలకపాటి మధు అనే వ్యక్తి యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తూ ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆయనతో పాటు మరికొందరు ఎమ్మెల్యే అడుగులకు మడుగులు ఒత్తుతూ టీడీపీలోని యాదవ సామాజిక వర్గం నేతల నుంచి ప్రతిపక్ష నేతలనూ సైతం టార్గెట్‌ చేసి అభ్యంతరమైన రీతిలో కించపరుస్తూ పోస్టులు పెట్టించడంతో పాటు ఈ–పేపర్‌ మీడియాల్లో కథనాలు రాయించి, ఆ కథనాలను సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ బోగోలు మండలాధ్యక్షుడు మద్దిబోయిన వీర రఘు అకాలంగా మృతి చెందారంటూ పోస్టులు పెట్టిన వీరు.. తాజాగా గుండ్లపల్లి మురళీయాదవ్‌ టీడీపీని వీడిపోయాడని అతన్నే కాదు.. ఆ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కించపరుస్తూ ‘యాదవ నాయాళ్లారా’ అని సంభోదిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదే సమయంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు ఇటీవల విక్రమసింహపురి యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేయడాన్ని కూడా తప్పు పడుతూ ఆయనపైనా దుష్ప్రచారం చేస్తూ పెయిడ్‌ ఈ–పేపర్‌ మీడియాల్లో కథనాలు రాయించారు. దీంతో ఆ సామాజిక వర్గంలో ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి పెల్లుబికింది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఆ సామాజిక వర్గం ఏకతాటిపైకి వచ్చి ఈ నెల 14న కావలిలోని జర్నలిస్టు క్లబ్‌లో మురళీయాదవ్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు చైతన్య, మరికొంతమంది నాయకులు మీడియా సమావేశంలో చిలకపాటి మధు పైశాచిక పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకపాటి మధుని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తమ సామాజికవర్గాన్ని టార్గెట్‌ చేసి కించపరచడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. అనంతరం ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సోషల్‌ మీడియా వేదికగా

నీచమైన పోస్టులు

సొంత పార్టీ నేత బీద

మస్తాన్‌రావునూ వదిలి పెట్టని వైనం

అన్ని పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయని పరిస్థితి

రగిలిపోతున్న ఆ సామాజిక వర్గీయులు

ఫిర్యాదులు బుట్టదాఖలు

ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నడిచే సోషల్‌ మీడియా ముసుగులో పెయిడ్‌ ఆర్టిస్ట్‌లు చిలకపాటి మధు, చిలకపాటి మనోహర్‌, మధు కిషోర్‌, తోకల శ్రీను, గొర్రెపాటి హరీష్‌ తదితరులు వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసి నిత్యం అభ్యంతరకరమైన రీతిలో పోస్టులు పెడుతుండడంతో ఇటీవల మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కావలి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో యాదవ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ పోస్టుల పెట్టడాన్ని నిరసిస్తూ కావలితోపాటు బోగోలు, దగదర్తి, అల్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఆ సామాజికవర్గీయులు వరుసగా ఫిర్యాదులు చేశారు. అయినా ఇంత వరకు కేసులు నమోదు చేయకపోగా, పోలీసులు సదరు సోషల్‌ మీడియా వ్యక్తులకు వత్తాసు పలకడాన్ని పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని యాదవులు ఏకతాటిపైకి వచ్చి మండి పడుతున్నారు. కేసులు బుట్టదాఖలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు తాము ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్‌ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు.

కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి అండతో కొంత మంది టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్ట్‌లు యాదవ సామాజికవర్గాన్ని టార్గెట్‌ చేసి అభ్యంతరకరమైన రీతిలో పైశాచిక ప్రచారానికి తెగబడుతున్నారు. ఆ సామాజిక వర్గీయులను కించపరుస్తూ సోషల్‌ మీడియాతో పాటు ఈ–పేపర్‌ మీడియాల్లో కథనాలు రాయిస్తున్న వైనం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయిలో ఆ సామాజిక వర్గీయులు రగిలిపోతున్నారు. సదరు సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయకపోగా, వారికే వత్తాసు పలుకుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement