నెల్లూరు నుంచే పోరుబాట | - | Sakshi
Sakshi News home page

నెల్లూరు నుంచే పోరుబాట

Jun 18 2026 12:17 AM | Updated on Jun 18 2026 12:17 AM

ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌

బొప్పరాజు వెంకటేశ్వర్లు

నెల్లూరు (అర్బన్‌): పోరాటాల పురిటి గడ్డ.. ఎన్నో ఉద్యమాలకు నాంది పలికిన నెల్లూరు నుంచే ఉద్యోగుల హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై పోరాడేందుకు శ్రీకారం చుడుతున్నామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పీఆర్సీ ఐఆర్‌, డీఏ అరియర్స్‌, సరెండర్‌ లీవు, ఎర్న్‌ లీవులు తదితర ఆర్థిక అంశాలపై కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన పోరాటంపై చర్చించేందుకు బుధవారం బొప్పరాజు వెంకటేశ్వర్లు నెల్లూరులో జేఏసీలో భాగస్వాములైన అన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వానికి వెన్నెముక వంటి వారన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేసేది కూడా ఉద్యోగులేనన్నారు. ఉద్యోగులకు ఉన్న గౌరవ ప్రదమైన జీవితాన్ని ఆర్థిక పరంగా దిగజార్చవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతున్నామన్నారు.

ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ సిద్ధం

ఇప్పటికే 28 జిల్లాల్లో ఉద్యమ కార్యాచరణపై కార్యవర్గ సమావేశాలు నిర్వహించామన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా కలిసొచ్చే సంఘాలను కలుపుకుంటూ మంత్రులను కలుస్తూ ఉద్యమ అవసరాన్ని వివరిస్తున్నామన్నారు. రెండు లక్షల మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారని, రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 90 శాతం ఉద్యోగుల ఖర్చులకే సరిపోతున్నాయని చెబుతూ ప్రజల దృష్టిని ప్రభుత్వం మళ్లించడం అన్యాయమన్నారు. పెన్షనర్లకు, ఉద్యోగులకు పెట్టే ఖర్చుపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్‌ అల్లంపాటి పెంచలరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెల సాధనకు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం చేపట్టే కార్యక్రమాలను వంద శాతం విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఒక్కటంటే ఒక్క ఆర్థిక ప్రయోజనం చేకూర్చలేదని తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ రాష్ట్ర ఉద్యమ కమిటీ చైర్మన్‌ ఫణిపేర్రాజు, జిల్లా జనరల్‌ సెక్రటరీ ఓవీ ప్రసాద్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌, జిల్లా మహిళా చైర్మన్‌ సోమిశెట్టి వసంతకుమారి, మహిళా సెక్రటరీ చెన్నమ్మ, కార్యవర్గ సభ్యులు థామస్‌, చెంచురామయ్య, మురళి, మాల్యాద్రి, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ నాయకులు డానియేల్‌ పీటర్‌, గోపీకృష్ణ, బాలకోటమ్మ, వెంకట్‌, ప్రధానోపాధ్యాయుల సంఘం గౌరవాధ్యక్షుడు ఎమ్వీ చలపతి, బుజ్జయ్య, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్ల సంఘ నాయకులు, ఆర్టీసీ యూనియన్‌ నాయకులు తదితరులు పాల్గొని ఉద్యమానికి మద్దతుగా సంఘీభావాన్ని ప్రకటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement