● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కూటమి ప్రభుత్వ, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. బుచ్చిరెడ్డిపాళెంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తనపై కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చేసిన విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇటీవల పెనుబల్లి, చెల్లాయపాళెం గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పెనుబల్లిలో రూ.60 లక్షలతో గ్రామ సచివాలయం, రూ.22లక్షలతో రైతుభరోసా కేంద్రం నిర్మించామని చెప్పారు. రూ.2.10 కోట్లతో ముంబై హైవే నుంచి పెనుబల్లి వరకు సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. జొన్నవాడ నుంచి బుచ్చిరెడ్డిపాళెం వరకు పెనుబల్లి మీదుగా రహదారి అభివృద్ధికి రూ.2.50 కోట్లు వెచ్చించామని తెలిపారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా మండల పరిషత్ పాఠశాలను రూ.15 లక్షలు, ఉన్నత పాఠశాలను రూ.35 లక్షలతో అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. తుపానుతో కూలిపోయిన పాఠశాల ప్రహరీని సహకార బ్యాంకుల ద్వారా రూ.45 లక్షలు సమీకరించి నిర్మించామని చెప్పారు. ఆనాడు డీసీఎమ్మెస్ చైర్మన్‌గా ఉన్న వీరి చలపతి రూ.25 లక్షలు, వవ్వేరు బ్యాంకు చైర్మన్‌గా ఉన్న సూరా శ్రీనివాసులురెడ్డి రూ.10 లక్షలు కేటాయించారని తెలిపారు అలాగే మరో బ్యాంకు చైర్మన్‌గా ఉన్న మేనకూరు సీతారామిరెడ్డి రూ.10 లక్షలు అందజేశారని చెప్పారు. ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే తెలుసుకుని మాట్లాడాలన్నారు. తమ ప్రభుత్వంలో 33 సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలకు అండగా నిలిచామని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ హామీలను కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. కనీసం ఒక్క కొత్త పెన్షన్ అయినా మంజూరు చేసిందా అని నిలదీశారు. మేము చేసిన అభివృద్ధిని సాక్షాధారాలతో సహా వెల్లడిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. కోవూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రౌడీయుజం ఎక్కువైందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్థి పార్టీల ఫ్లెక్సీలు చించివేయడంతో పాటు కార్యకర్తలపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ వంశీపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ రాజకీయ భిన్నాభిప్రాయాలను హింసతో అణచివేయాలని చూడడం ప్రమాదకర ధోరణి అని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను ఎదుర్కోవాలి గానీ దాడులతో సమాధానం చెప్పడం సరికాదన్నారు. అధికార పార్టీ నాయకులు తమ వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన సమయంలో సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.


