శ్రీవారి దర్శనానికి 15 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 15 గంటలు

Jun 18 2026 12:17 AM | Updated on Jun 18 2026 12:17 AM

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 86,601 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,111 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.32 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ వినతుల స్వీకరణ నేడు

నెల్లూరు(వేదాయపాళెం): డెడికేటెడ్‌ బీసీ కమిషన్‌ చైర్మన్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌రంజన్‌మిశ్రా కలెక్టరేట్‌ ఆవరణలోని తిక్కనభవన్‌లో గురువారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి పీ వెంకటలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరిస్తారని చెప్పారు. జిల్లాలోని కుల సంఘాలు, పౌరులు, ప్రజాప్రతినిధులు తమ వినతులను అందజేయాలని కోరారు.

ఊనుగుంటపాళెంలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం

కోట: మండలంలోని ఊనుగుంటపాళెం సమీపంలో 12 మెగా వాట్స్‌ సామర్థ్యంతో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌తెలిపారు. బుధవారం రాత్రి ఆయన సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కోసం సేకరించిన స్థలాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కోసం 40 ఎకరాలు సేకరించినట్లు తెలిపారు. మోహన్‌ స్పింటెక్స్‌ సంస్థ విద్యుత్‌ కేంద్రం పనులు చేపడుతుందని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను యూనిట్‌ రూ.3.09 వంతున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఆయన వెంట టెక్నికల్‌ డైరెక్టర్‌ గురవయ్య, సీజీఎం రమణ, నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్‌ఈలు రాఘవేంద్ర, చంద్రశేఖర్‌, గూడూరు ఈఈ నరేంద్రరెడ్డి ఉన్నారు.

అవినీతిలో టీడీపీ నేతల కొత్తపుంతలు

కాలువలో నీరు ప్రవహిస్తుండగానే

పూడికతీత పనులు

బిల్లుల కోసమే తూతూమంత్రంగా చేపడుతున్నారని రైతుల గగ్గోలు

మనుబోలు: సర్వేపల్లి నియోజకవర్గ అధికార పార్టీ నాయకులు అవినీతిలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇరిగేషన్‌ పనులు చేయకుండానే చేసినట్లుగా చూపిస్తూ బిల్లులు చేసుకున్న ఉదంతాలు మరవక ముందే మరో సరికొత్త అవినీతికి తెరతీశారు. మనుబోలు మండలంలోని వీరంపల్లి నుంచి చెర్లోపల్లి వరకు ఉన్న కండలేరు పంట కాలువలో నిండుగా నీరు ప్రవహిస్తుండగానే పూడికతీత పనులు పడుతున్నారు. సాధారణంగా పంట కాలువల్లో సాగునీటిని విడుదల చేయకముందే పూడికతీత పనులు చేపట్టాలి. కానీ టీడీపీ నాయకులు అందుకు విరుద్ధంగా కాలువకు నీరు వదిలాక పూడికతీత పనులు చేపట్టడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని దోచుకునేందుకు తూతూ మంత్రంగా కాలువ గట్టుపై ఉన్న గడ్డిని తొలగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement