వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో సుమారు రెండు గంటల పాటు కురిసిన వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగ్లా సెంటర్‌లోని ఇరిగేషన్ కార్యాలయం, ఎస్సీ వసతిగృహంలోకి సుమారు అడుగున్నర మేర వర్షపు నీరు చేరడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కులోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఈదురుగాలులకు ఎమ్మెస్సార్ డిగ్రీ కళాశాల సమీపంలోని కాలనీలో చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీలు నేలకొరిగాయి. పట్టణంలోని పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని బొమ్మరాజుచెరువు ప్రాంతంలో ఇటుకబట్టీల్లోని ఇటుకలు వర్షానికి తడిసిపోయాయి. మామిడితోటల్లోని కాయలు నేలరాలడంతో రైతులు నష్టపోయారు. కలిగిరి, జలదంకి, వింజమూరు, కొండాపురం, దుత్తలూరు మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీవ్ర ఎండవేడితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వేళ ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసి వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు.


