ఉదయగిరి రూరల్: మండల తహల్దార్ కార్యాలయంలో బుధవారం ఓ రైతు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గన్నేపల్లి రెవెన్యూ పరిధిలోని కొట్టాలపల్లికి చెందిన కే రామానాయుడుకు 135–3–2 సర్వేనంబరులో 60 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. వారసత్వంగా వచ్చిన ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో భూమిపై బ్యాంకులో వ్యవసాయ రుణం సైతం తీసుకుని చెల్లించి ఉన్నాడు. ప్రస్తుతం భూమిపై వ్యవసాయం రుణం పొందేందుకు బ్యాంకుకు వెళ్లగా నిషేధ జాబితాలో ఉందని తిరస్కరించారు. ఈ విషయమై రైతు వీఆర్వోను అడిగేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ సీట్‌లో ఉన్న వీఆర్వోకు సమస్యను విన్నవించే క్రమంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అంతలో గన్నేపల్లి వీఆర్వో కార్యాలయానికి రాగా తన భూమిని ఎలా మారుస్తారు అంటూ నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తహసీల్దార్ ఎల్ రామ్మోహన్‌రావు దృష్టికి తీసుకెళ్లగా లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేస్తే రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


