● రైల్వే స్టేషన్లలో భద్రతపై ప్రత్యేక దృష్టి
● కొనసాగుతున్న తనిఖీలు
● ప్రయాణికుల జాగ్రత్తగా ఉండాలి
● సూచించిన అధికారులు
నెల్లూరు(క్రైమ్): జిల్లా రైల్వే పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. ఆదివారం అర్ధరాత్రి బాపట్ల సమీపంలో దొంగలు రైల్లోని మహిళల వద్ద బంగారు నగలు దోచుకుని పరావుతుండగా పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో రైల్వే డీఎస్పీ మురళీధర్ నేతృత్వంలో సీఐ ఎ.సుధాకర్, ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌గౌడ్ తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి రైల్వేస్టేషన్లు, రైళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. నేరాలు జరిగిన/అవకాశమున్న శ్రీవెంకటేశ్వరపాళెం, బిట్రగుంట, అల్లూరు రోడ్డు, కొడవలూరు, వెంకటాచలసత్రం, గూడూరు చైన్నె ఔటర్, రేణిగుంట ఔటర్ పాయింట్‌లో సాయుద సిబ్బందితో పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక హైవే పోలీసులను సమన్వయం చేసుకుని రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న హైవే వెంబడి గస్తీని పెంచారు. పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచారు.
ఏం చేస్తున్నారంటే..
దొంగల కళ్లు బంగారంపైనే ఉంటున్నాయి. రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫారంలపై సంచరిస్తూ ఏ బోగీల్లో మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరించారో గుర్తిస్తున్నారు. ప్రయాణికుల్లా ఆ బోగీల్లో ఎక్కి అందరితో కలివిడిగా ఉంటున్నారు. అదును చూసి బ్యాగ్ లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణా లను తస్కరించి క్షణాల్లో మాయం అవుతున్నారు. సాంకేతికతను ఆయుధంగా మలుచుకుని సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు.
గతంలో పలు ఘటనలు
● రెండేళ్ల క్రితం కావలి – శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ మధ్య దుండగులు సిగ్నల్ ట్యాంపర్ చేసి నరసాపురం నుంచి ధర్మవరం వెళ్తున్న రైల్లో ఎస్ – 13, ఎస్ – 11 బోగీల్లో దోపిడీ చేశారు. అడ్డువెళ్లిన ప్రయాణికుడిపై రాళ్లతో దాడిచేసి గాయపరిచారు. అదేరోజు షిర్డీ సాయినగర్ నుంచి తిరుపతి వెళ్తున్న రైల్లోని ఎస్ – 3, ఎస్ – 5 కోచ్‌ల్లోనూ చోరీ చేశారు.
● గతేడాది అల్లూరు రోడ్డు రైల్వేస్టేషన్ సమీపంలో దుండగులు హోమ్ సిగ్నల్స్ ట్యాంపర్ చేయడంతో హౌరా నుంచి బెంగళూరు వెళ్లే రైలు ఆగిపోయింది. అయితే సిగ్నల్ ట్యాంపర్ జరిగిన ప్రాంతానికి రైలు నిలిచిన ప్రాంతానికి మధ్య దూరం ఉండటంతో దోపిడీ విఫలమైంది.
● అదేరోజు గంట అనంతరం చండీఘర్ నుంచి మదురై వెళ్తున్న రైల్లో దుండగులు చైన్‌లాగి ఎస్ – 2, ఎస్ – 4, ఎస్ – 5 కోచ్‌ల్లోని ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు చైన్లు, బ్యాగ్‌లు అపహరించారు.
● గతేడాది మేనెలలో శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ వద్ద నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం చేశారు.
జాగ్రత్తలు తప్పనిసరి
ప్రయాణికులు రైళ్లలో ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అపరిచితులు ఇచ్చే తినుబండారాలు, పానీయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరాదు. మహిళలు సాధ్యమైనంత మేరకు ప్రయాణాల్లో బంగారు ఆభరణాలు ధరించకపోవడం మంచింది. రాత్రి వేళల్లో కిటికీ పక్కన ఉంటే నగలు, ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి. కిటికీ అద్దాలు మూసి ఉంచాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 139కు లేదా బోగీల్లోని టీటీఈ, రైల్వే పోలీసులకు సమాచారం అందించాలి.
చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు
రైళ్లలో చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాన్నాం. బీట్ వ్యవస్థను పటిష్టం చేశాం. నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశాం. పాతనేరస్తులు, అంతర్ రాష్ట్ర ముఠాల కదలికలపై నిఘా పెంచాం. దొంగలు కనిపిస్తే కాల్చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి.
– ఎ. సుధాకర్, రైల్వే సీఐ


