● వృద్ధుడి మృతి
నెల్లూరు(క్రైమ్): రైల్లోంచి ప్రమాదవశాత్తు జారి కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు కొండాయపాళెం గేటు సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై మంగళవారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 60 నుంచి 65 ఏళ్లలోపు ఉంటుందని భావిస్తున్నారు. గ్రే కలర్ హాఫ్ హ్యాండ్స్ టీషర్టు ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 92475 75628 ఫోన్ నంబర్‌కు తెలియజేయాలని ఆమె కోరారు.
గూడ్స్ రైలు కిందపడి..
● గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
రాపూరు: ఓబులవారిపల్లి – కృష్ణపట్నం పోర్టు రైల్వే మార్గమధ్యలో రాపూరు సమీపంలో గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. అతని వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. కాఫీ కలర్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. కేసు నమోదు చేశామని రైల్వే ఎస్సై హరిచందన తెలిపారు.
వీధికుక్క దాడిలో
బాలుడికి తీవ్రగాయాలు
మర్రిపాడు: మండలంలోని ఇర్లపాడు గ్రామంలో వీధికుక్క దాడిలో 9 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. భరత్ కృష్ణ మంగళవారం ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వీధికుక్క దాడి చేసి పలుచోట్ల కరిచినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని మర్రిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, వైద్యుడు గోపీనాథ్ చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇదిలా ఉండగా గ్రామాల్లో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నా రులు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి వీధికుక్కల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఐస్ ఫ్యాక్టరీలో మృతదేహం
కోవూరు: కోవూరు సమీపంలోని రామన్నపాళెం గేటు వద్ద ఉన్న పాడుబడిన ఐస్ ఫ్యాక్టరీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతని వయసు, మరణానికి గల కారణాలపై ప్రాథమిక వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
ఆపేవారేరీ?
● ఆగని ఇసుక అక్రమ రవాణా
● పట్టించుకోని అధికారులు
కావలి: జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఇసుక రీచ్‌లను మూసి వేసినా యథేచ్ఛగా అక్రమ రవాణా సాగుతోంది. అధికార పార్టీ నాయకుల అండదండలతోపాటు అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈనెల 8వ తేదీ నుంచి రీచ్‌లను మూసివేయగా డంపింగ్ యార్డ్‌ల నుంచి ఇసుక తరలించాల్సి ఉంది. అయితే పగలు, రాత్రి అనే తేడా లేకుండా రీచ్‌ల నుంచే ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. పొట్టకూటి కోసం ట్రాక్టర్లు, ఆటోలు నడుపుకొని జీవనం సాగించే వారిపై జులుం ప్రదర్శించే అధికారులు అధికలోడుతో ఇసుక తరలిస్తుంటే ఏమి చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
గుండెపోటుతో
వ్యవసాయాధికారి మృతి
బుచ్చిరెడ్డిపాళెం: మండల వ్యవసాయాధికారి నడవాటి శ్రీహరి (46) గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం ఆయన బుచ్చి మండలంలో జరిగిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పర్యటనలో పాల్గొన్నాడు. సాయంత్రం అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని తన నివాసానికి చేరుకున్నాడు. అనంతరం అకస్మాత్తుగా గుండెలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రాత్రి మృతిచెందాడు. శ్రీహరికి భార్య, పిల్లలున్నారు. మృతి విషయం తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, రైతు సంఘాల నాయకులు ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.


