రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం

Jun 17 2026 12:10 AM | Updated on Jun 17 2026 12:10 AM

వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌

రాష్ట్రాధ్యక్షుడు జాన్‌ వెస్లీ

నెల్లూరురూరల్‌: ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యంగా మారింది. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారు’ అని వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్రాధ్యక్షుడు జాన్‌ వెస్లీ విమర్శించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశం జరిగింది. తొలుత ఆ పార్టీ నెల్లూరు రూరల్‌ సమన్వయకర్త ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అన్ని సంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి నేతలు ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌ అంటూ ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసనీయత, చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. జాన్‌ వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రిస్టియన్లు, మైనార్టీలపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. కార్పొరేట్‌, మతతత్వ, కులతత్వ విధానాలతో ప్రభుత్వ వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని విమర్శించారు. భూ, ఇసుక, మద్యం, గంజాయి మాఫియాలు పెట్రేగిపోతున్నాయన్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులు కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. క్రిస్టియన్‌ మైనార్టీ కమిషన్‌ను ఇప్పటివరకు ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైఎస్‌ జగన్‌ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం అందించడంతో పాటు పేద క్రైస్తవులకు జెరూసలేం యాత్ర అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఒక్కరినైనా జెరూసలేం యాత్రకు పంపిందా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారన్నారు. కార్యక్రమంలో క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు అనుదీప్‌, సిటీ అధ్యక్షురాలు సులోచన, రూరల్‌ అధ్యక్షుడు దాసరి రాజేష్‌, విభాగ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement