జిల్లాలోని కోవూరు నియోజకవర్గానికి చెందిన ఓ రైతుకు 14 ఎకరాల పొలం ఉంది. రబీలో ఎకరాకు సగటున 4 పుట్ల లెక్కన 56 పుట్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇక్కడ ధాన్యం ధరలు మరింత దారుణంగా ఉండడంతో తమిళనాడులోని రెడ్‌హిల్స్‌లోని రైస్‌మిల్లర్లతో మాట్లాడుకున్నారు. అన్ని అనుమతులతో అక్కడికి తరలించేందుకు రెండు 12 టైర్ల లారీలను బాడుగకు మాట్లాడుకున్నాడు. లారీ కెపాసిటిని బట్టి ఒక లారీకి 26 టన్నులు, మరో లారీకి 28 టన్నుల ధాన్యం లోడ్ చేశాడు. రెండు పుట్ల ధాన్యం సొంతానికి ఉంచుకున్నాడు. ఈ లారీలను వెంకటాచలం టోల్‌గేట్ అవతల నెల్లూరు రవాణాశాఖాధికారులు తనిఖీ చేశారు. ఈ లారీలకు నెల మామూలు కార్డులు లేవు. దీంతో ఒక లారీలో 2 టన్నుల ధాన్యం ఎక్కువగా ఉందని.. సదరు ఎంవీఐ ఏకంగా రూ.32 వేలు జరిమానా విధించాడు. దీంతో ధాన్యం యజమాని రెండు టన్నుల కోసం మరో లారీని పెట్టలేక ఇందులో తీసుకెళ్తున్నామని కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. పక్క రాష్ట్రంలోకి తీసుకెళ్లి విక్రయించుకుంటే నాలుగు రూపాయలు ఎక్కువ వస్తాయని ఆశించిన రైతు విషయంలో రాక్షసంగా వ్యవహరించడంతో ఏమీ చేసేదీ లేక చెల్లించి చేతులు దులుపుకుని వెళ్లాడు.
ప్రతి నెలా ఆర్టీఏ అధికారులకు మామూళ్లు
ఆరు టైర్ల వాహనాలు 450 X 12,000 = 54,00,000 పది టైర్ల వాహనాలు 550 X 16,000 = 90,75,000
రవాణా శాఖాధికారులు రాబందుల కంటే దారుణంగా తయారయ్యారు. జిల్లాలోనూ, జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు నిత్యం వేలాది లారీలు, టిప్పర్లు, ట్రాలీ వాహనాల్లో అధిక టన్నేజీతో గ్రానైట్, ఇసుక, సిలికా, క్వార్ట్‌జ్‌తో పాటు రేషన్ బియ్యం లారీలు యథేచ్ఛగా వెళ్తున్నాయి. ఇలాంటి ఏ వాహనాలపై ఒక్క కేసు నమోదు చేసిన దాఖలాలైతే లేవు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటలకు స్థానికంగా గిట్టుబాటు ధరలు రాక పక్క రాష్ట్రాలకు తీసుకెళ్తుంటే టార్గెట్ చేసి వేలకు వేలు జరిమానాలు విధించి తమలోని అవినీతి రక్కసిని చాటుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీల పేరుతో ఓవర్ టన్నేజీలకు రూ.లక్షల్లో టర్నోవర్ చేసున్నారు. జిల్లా నుంచి వెళ్లే ధాన్యం లారీలే కాకుండా.. పండ్లు, రొయ్య ల, చేపల వాహనాలే లక్ష్యంగా రవాణాశాఖాధికారులు ఒకటి.. రెండు.. టన్నులు అధికంగా ఉంటే పెద్దనేరంగా భారీ మొత్తంలో చలాన్లు విధించి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కోల్‌కతా–చైన్నె నేషనల్ హైవేపై మనుబోలు సమీపంలో ప్రతి నిత్యం సాయంత్రం రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తుంటారు. ప్రతి వాహనాన్ని నిలిపి తనిఖీలు చేస్తారనుకుంటే పొరపాటే. నెల మామూళ్లు చెల్లించే వాహనాలకు రవాణాశాఖ పోస్ట్‌పెయిడ్ కార్డులు ఇస్తోంది. తమ వద్ద ఉండే జాబితాలో ఆ వాహన నంబర్లు ఉంటే పంపిస్తారు. లేదంటే అధిక టన్నేజీ చూపి టన్నుకు రూ.2 వేలు లెక్కన అనధికారికంగా వసూలు చేస్తున్నారు. నెల్లూరు రవాణాశాఖ ఎంవీఐ తన డ్రైవర్‌తో నిత్యం దందా చేస్తూ రోజుకు రూ.లక్ష లేనిదే ఇంటికి వెళ్లడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన ఉన్నతాధికారులకు వాటాలు పంచుతూ.. మిగిలింది తన జేబులో వేసుకుంటున్నారని ఆ శాఖాధికారులే చెబుతున్నారు. ఇటీవల నెల్లూరు నుంచి చైన్నెకు బియ్యం లోడుతో వెళ్తున్న నాలుగు వాహనాలను నిలిపివేశారు. ఒక్కో వాహనంలో 3 టన్నులు అధికలోడు ఉందని, టన్నుకు రూ.5 వేలు వంతున వసూలు చేసుకుని పంపించేశారు.
లంచం పర్మిట్ ఉంటే.. సరి
జిల్లా నుంచి నిత్యం వందలాది లారీలు, టిప్పర్లు, ట్రాలీల్లో పక్క రాష్ట్రాలకు ఇసుక, రేషన్ బియ్యం, గ్రానైట్, క్వార్ట్‌జ్, మైకా, సిలికా తరలిస్తున్నారు. స్థానికంగా తిరిగే టిప్పర్లు, లారీలు సైతం అధిక టన్నేజీతో రవాణా చేస్తున్నాయి. ఒక్కో టిప్పర్‌కు 36 టన్నుల కెపాసిటీ ఉంటే.. 50 నుంచి 60 టన్నుల వరకు ఇసుక, సిలికా, క్వార్ట్‌జ్, మైకా లోడ్ చేసుకుని వెళ్తున్నా.. 70 టన్నుల కెపాసిటీ ఉన్న ట్రాలీల్లో 100 నుంచి 130 టన్నుల వరకు గ్రానైట్ బండలను రవాణా చేస్తున్నా.. అటువంటి వాహనాలపై ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. అధిక టన్నేజీ వాహనాలకు నెల మామూళ్లు చెల్లిస్తుండడంతో టన్నేజీ సంగతి పక్కన పెడితే.. సరైనా పత్రాలు లేకున్నా రైట్ రైట్ అంటూ పంపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వేళ నెల మామూలు చెల్లింపుల్లో ఆలస్యమైనా చాలు రహదారిపై కాపు కాసి వాహనాలను నిలిపి ముక్కు పిండి వసూళ్లు చేసుకుంటున్నారు. ముడుపులు చెల్లించని వాహనాలను పట్టుకొని కేసులు నమోదు చేసి ముప్పతిప్పలు పెడుతున్నారు. దీంతో వాహన యజమానులు మాత్రం అధిక లోడింగ్ ఉన్నా.. లేకున్నా నెల మామూళ్లు సమర్పించుకుని వెళుతున్నారు. జిల్లా పరిధిలో సుమారు 1000 పైగా లారీలు, టిప్పర్లు, ట్రాలీలు ఉన్నాయి. జిల్లాలో జరిగే రహదారుల నిర్మాణాలు, భవన నిర్మాణ రంగం, సాగునీటి ప్రాజెక్టులు, ఇతరత్రా అవసరాలతో మట్టి, కంకర, ఇసుక, రవాణా చేస్తున్నాయి. పలు ప్రాంతాల నుంచి క్రషర్స్ నుంచి కంకర తోలకాలు సాగిస్తున్నారు. బిల్లులు లేకుండా పలు రకాల సరుకులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పశువులు, గ్రానైట్ రవాణా సాగుతోంది. కృష్ణపట్నం పోర్టుకు వివిధ రకాల సరుకులు, వస్తు సామగ్రి కూడా ఎగుమతుల కోసం తరలిస్తున్నారు. ఆయా వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా రవాణా సాగిస్తున్నాయంటే.. ఆ శాఖాధికారులకు నెల మామూళ్లు చేరుతున్నాయని అర్థమవుతోంది.
రవాణా శాఖ అధికారుల అక్రమ వసూళ్లు
నెల మామూళ్లు రూ.1.45 కోట్ల్లు
దళారులను పెట్టి మరీ దండకాలు
ఇవ్వని వాహనాలను
టార్గెట్ చేసి దాడులు
ధాన్యం, బియ్యం లారీలే ప్రధాన లక్ష్యం
ఓవర్ టన్నేజీతో నిత్యం వందల వాహనాల్లో గ్రానైట్, ఇసుక, రేషన్ బియ్యం రవాణా
మంత్లీ కార్డు ఉంటే.. ఓవర్ టన్నేజీ ఉన్నా సరైన పత్రాలు లేకున్నా రైట్ రైట్
నెలకు రూ.లక్షల్లో వసూళ్లు
ఉమ్మడి నెల్లూరు ఆర్టీఏ పరిధిలోని 12 మంది మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లతోపాటు స్పెషల్ స్క్వాడ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు ఉన్నాయి. జిల్లాలో ఆత్మకూరు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల వెహికల్ ఇన్‌స్పెక్టర్లు నెలవారీ వచ్చే దండకాలు సమానంగా పంచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి వసూళ్ల కోసం దళారులను పెట్టుకున్నారు. ఆ దళారులే వాహన యజమానులు వద్ద వసూలు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆరు టైర్ల వాహనానికి నెలకు రూ.12 వేలు, పది టైర్ల వాహనానికి రూ.16 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా 10వ తేదీలోగా చెల్లించకపోతే.. భారీ చలాన్లు పడక తప్పదు.
నెల మామూళ్లు తీసుకొనేందుకు ఆర్టీఏ కార్యాలయంలోని ఇద్దరు కీలకంగా వ్యవహరిస్తారు. వారు ప్రతి వాహనదారుడితో లావాదేవీలు జరిపి నెలవారీగా వసూళ్లు చేసి అందరికి పంపకాలు చేస్తారు. ఇక పోలీసులకు మాత్రం ఒక్కో స్టేషన్ పరిధిలోని ఎస్‌ఐకు సన్నిహితంగా మెలిగే ఓ కానిస్టేబుల్ ద్వారా వసూళ్ల ప్రక్రియ చేపడతారు. ఇలా వసూళ్లు చేసినందుకు వారికి ప్రత్యేకంగా కొంత నగదు ఇస్తుంటారు.


