● ఆర్డీఓ కార్యాలయంలో
బైఠాయించిన డ్వాక్రా మహిళలు
కావలి రూరల్: భూ సమస్యను పరిష్కరించాలని ఆరు నెలలుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని చెన్నాయపాళెం పంచాయతీ పరిధిలోని ఆరు గ్రామాలకు చెందిన డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వారు భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కావలి ఆర్డీఓ కార్యాలయంలోని గ్రీవెన్స్‌హాల్లో బైఠాయించి ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1998లో ప్రభుత్వం ఆరు గ్రామాల డ్వాక్రా మహిళల ఉపాధికి 190 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. 1998లో గ్రామంలో చోటు చేసుకున్న గొడవల నేపథ్యంలో తాము ఊర్లను, భూమిని వదిలి వలస వెళ్లినట్లు చెప్పారు. గొడవలు సద్దుమణిగిన తర్వాత తిరిగి వచ్చి ప్రభుత్వ అనుమతితో జామాయిల్ సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అయితే తమ భూములపై కన్నేసిన కొందరు రాజకీయ నాయకులు రికార్డుల్లో పేర్లు మార్చుకుని కబ్జా చేశారని ఆరోపించారు. ఇటీవల బీపీసీఎల్ కంపెనీకి కేటాయించిన భూములకు సంబంధించి నష్టపరిహారం చెల్లిస్తుండగా కబ్జా విషయం తెలిసిందన్నారు. ఈ విషయమై న్యాయం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్‌కు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు. తమ సమస్యను పరిష్కరించాలని ఆర్డీఓ ఎలీషా, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్‌ను వేడుకున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పెద్దపట్టపుపాళేనికి వచ్చి భూ సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. మంగళవారం 12 గంటల వరకు ఎదురుచూస్తామని తహసీల్దార్ వచ్చి సమస్యను పరిష్కరించకపోతే కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగేందుకు వెనుకాడబోమని డ్వాక్రా మహిళలు హెచ్చరించారు.


