బీసీ వెల్ఫేర్‌ ఉద్యోగులకు పదోన్నతులు | - | Sakshi
Sakshi News home page

బీసీ వెల్ఫేర్‌ ఉద్యోగులకు పదోన్నతులు

Jun 16 2026 12:34 AM | Updated on Jun 16 2026 12:34 AM

నెల్లూరు(వేదాయపాళెం): బీసీ సంక్షేమ శాఖలో నాల్గో తరగతి ఉద్యోగులుగా పనిచేస్తున్న బీ సురేష్‌, యూ రత్నకుమారికి పదోన్నతులు లభించాయి. వారి అర్హతలను అనుసరించి గ్రేడ్‌–2 హాస్టల్‌వెల్ఫేర్‌ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించినట్లు ఆ శాఖ జిల్లా సాధికారిత అధికారిణి పీ వెంకటలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని తిక్కనభవన్‌లో కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పదోన్నతుల ఉత్తర్వులను అందజేశారని చెప్పారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

ఉపకారవేతనాలకు

దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర కార్మిక శాఖ ఒకటో తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న కార్మికుల పిల్లల నుంచి ఉపకారవేతనాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని జిల్లా బీడీ కార్మిక సంక్షేమ అస్పత్రి సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కేవీ భాస్కర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐరన్‌, మాంగనీస్‌, లైమ్‌స్టోన్‌, డోలామైట్‌, మైకా గనులతో పాటు బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలు ఉపకారవేతనాలకు అర్హులని చెప్పారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఆగస్ట్‌ 31వ తేదీలోగా, ఇంటర్‌ నుంచి ఆపై తరగతులు చదువుతున్న వారు అక్టోబరు 31వ తేదీలోగా నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

రామతీర్థం బీచ్‌లో

సామూహిక యోగా నేడు

నెల్లూరురూరల్‌: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడవలూరు మండలం రామతీర్థం బీచ్‌లో మంగళవారం ఉదయం 6 గంటలకు సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సోమవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే స్వర్ణాల చెరువు, రామతీర్థం బీచ్‌తో పాటు రెసిడెన్షియల్‌ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించిన యోగా కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. యోగా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement