ఎస్పీబీ విగ్రహ ఏర్పాటు సంతోషకరం.. | - | Sakshi
Sakshi News home page

ఎస్పీబీ విగ్రహ ఏర్పాటు సంతోషకరం..

Jun 15 2026 12:23 AM | Updated on Jun 15 2026 12:23 AM

సినీ నటుడు శుభలేఖ సుధాకర్‌

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): నెల్లూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్‌ అన్నారు. ఆదిత్యా నగర్‌లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్కును ఆదివారం ఆయన సందర్శించారు. ఎస్పీబీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరుతో పార్కులు ఏర్పాటు చేసి, అందులో విగ్రహాలు ప్రతిష్టించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం పేరిట నిర్వహించే ఏ కార్యక్రమానికై నా తాను తప్పకుండా హాజరవుతానని చెప్పారు. బాలుపై నెల్లూరు ప్రజలకు ఉన్న అభిమానం మాటల్లో చెప్పలేనిదని ఆయన పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా నాకాబందీ

నెల్లూరు(క్రైమ్‌): నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శనివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ అధికారులు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, శివారు ప్రాంతాలు, అనుమానిత నివాసాలు, వాణిజ్య సముదాయాలు, హైవేల వద్ద వాహన తనిఖీలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 21 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనల ఉల్లంఘనులపై ఎంవీ యాక్ట్‌ కింద 432 కేసులు నమోదు చేసి రూ.1,67,800ల జరిమానా విధించారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై 32 కేసులు నమోదు చేశారు. లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ బసచేసిన వ్యక్తుల వివరాలను సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలు, రౌడీయిజం, ఈవ్‌టీజింగ్‌, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాను గుర్తిస్తే సమీప పోలీస్‌స్టేషన్‌ లేదా డయల్‌ 100/112, పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌ నంబర్‌ 93929 03143కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నేటి నుంచి యోగా పోస్టర్‌ తయారీ పోటీలు

జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహణ

నెల్లూరు(టౌన్‌): అంతర్జాతీయ యోగాదినాన్ని పురస్కరించుకుని విద్యాశాఖ, జాతీయ జనాభా విద్యా కార్యక్రమం, డైట్‌ల ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు అన్ని యాజమాన్య ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో యోగా పోస్టర్‌ తయారీ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్‌.బాలాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్యం కోసం యోగా, పాఠశాలల్లో యోగా (యోగా ఫర్‌ హెల్త్‌, యోగా ఎట్‌ స్కూల్‌) అనే అంశాలపై ఈ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాఠశాల స్ధాయిలో నిర్వహించిన పోటీలకు సంబంధించి అన్ని పోస్టర్లను స్కాన్‌ చేసి dietpallipadu@gmail. comకు ఈ–మెయిల్‌ చేయాలన్నారు. తద్వారా పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఉత్తమ పోస్టర్లు ఎంపిక చేస్తామని వివరించారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు రూ.1,000, రూ.750, రూ.500 నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. అన్ని డివిజన్ల డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, హెడ్‌మాస్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. వివరాలకు 90100 85011 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.60

సన్నవి : రూ.25

పండ్లు : రూ.10

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement