● బండి శిల్పారెడ్డి ఆవేదన
సంగం: ‘నన్ను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయి. రక్షణ కల్పించాలి’ అని బండి శిల్పారెడ్డి కోరారు. సంగం పంచాయతీ పరిధిలోని అమరపునాయుడుకండ్రిక గ్రామంలో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నామని తెలిపారు. అనంతరం గ్రామంలో పదుల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు జరిగాయన్నారు. సర్వే నంబర్ 285లో 48.03 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అందులో 40 మందికి పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. టీడీపీ నాయకుడు బాణా శ్రీనివాసులురెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖ అవినీతికి పాల్పడిందంటూ బంకా రామకృష్ణారెడ్డి లోకాయుక్తను ఆశ్రయించారని తెలిపారు. అక్కడి నుంచి ఒక ఇంటి నిర్మాణాన్ని తొలగించాలంటూ తీర్పు వచ్చిందన్నారు. దీనిపై ఇరిగేషన్ శాఖ అధికారులిచ్చిన నోటీసులకు సమాధానాలు ఇచ్చానన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ బాణా శ్రీనివాసులురెడ్డి పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తనపై ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. గ్రామానికి చెందిన కొంకాల రామకృష్ణారెడ్డి తన బంధువులకు ఫోన్ చేసి బిహార్ నుంచి హంతకులను తీసుకొచ్చి శిల్పారెడ్డిని చంపిస్తామని బెదిరించారని ఆరోపించారు. అలాగే నెల్లూరుకు చెందిన కొందరు మహిళలు ఫోన్లు చేసి బెదిరించారన్నారు. అప్పట్లో సంగం ఎస్సైలుగా పనిచేసిన నాగార్జునరెడ్డి, రాజేష్‌కు ఫిర్యాదులు చేసినా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.


