ఆక్రమణలో వందలెకరాలు
చేజర్ల: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా తెలుగు తమ్ముళ్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూములపై కన్నేసి ఇప్పటికే వందలాది ఎకరాలను కబ్జా చేశారు. అయినా వీరి భూ దాహం తీరడంలేదు. అధికారులను నయానో.. భయానో భయపెట్టి ఏదో విధంగా వాటిని ఆన్‌లైన్ చేయించుకోని హస్తగతం చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా కోటితీర్థంలో దళితుల భూములకెళ్లే దారితో పాటు ప్రభుత్వ అనాధీన భూమిని మంత్రి ఆనం ముఖ్య అనుచరులు యథేచ్ఛగా ఆక్రమించుకొని కబ్జా చేశారు.
జరిగిందిదీ..
చేజర్ల మండలం కోటితీర్థంలో గల సర్వే నంబర్ 876, 877లో ప్రభుత్వ అనాధీన భూమిని తెలుగు తమ్ముళ్లు రాత్రికి రాత్రే యంత్రంతో చదును చేసి దర్జాగా ఆక్రమించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి గ్రామానికి చెందిన మంత్రి ఆనం అనుచరులు కొమ్మి పార్థసారథినాయుడు, కొమ్మి రత్నయ్యనాయుడునాయుడు పెత్తనం చెలాయిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన రైతులను పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా అన్ని అనుమతులు పొంది ఎప్పట్నుంచో సాగు చేసుకుంటున్నా కొద్దిపాటి భూములపై సైతం వీరు కన్నేశారు. అధికారులను అడ్డుపెట్టుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలా గ్రామ సమీపంలోని సుమారు ఐదెకరాల ప్రభుత్వ అనాధీన భూమిని శుక్ర, శనివారాల్లో చదును చేసి ఆక్రమించారు. చెరువు కుంట, పొరంబోకు భూములను ఇప్పటికే వీరు ఆక్రమించి చేపలు రొయ్యల చెరువులుగా లీజుకూ ఇచ్చారు. ఇంత జరుగుతున్నా, రెవెన్యూ అధికారులు మాత్రం కన్నెత్తి చూడటంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వీరు ప్రస్తుతం ఆక్రమించిన ఈ భూమిలో గత ప్రభుత్వ హయాంలో చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఆక్రమణకు గురైన భూమి
కోటితీర్థంలో ప్రభుత్వ ల్యాండ్స్ కబ్జా
దళితుల పొలాలకు వెళ్లే
దారి సైతం ఆక్రమణ
తమ ప్రభుత్వమే కదా మమ్మల్నేమి చేస్తారనే ధీమా
ఇప్పటికే వందలెకరాలు
కబంధహస్తాల్లో
ప్రేక్షకపాత్ర పోషిస్తున్న
రెవెన్యూ అధికారులు
ప్రభుత్వ భూములు
అన్యాక్రాంతం
కూటమి సర్కార్ వచ్చాక ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. ఎవరు పడితే వారు చట్టవిరుద్ధంగా ఆక్రమించి సొంతం చేసుకుంటున్నారు. దీనిపై ఉక్కుపాదం మోపాలి.
– గోతం రమేష్,
మాజీ సర్పంచ్, కోటితీర్థం
దారిని సైతం ఆక్రమించారు
దళితులకు ప్రభుత్వమిచ్చిన భూమిలోకి వెళ్లేందుకు సంబంధించిన శాశ్వత రహదారిని సైతం ఆక్రమించారు. ఈ సౌకర్యం లేకపోతే మాకు ఇబ్బందులు తప్పవు. రెవెన్యూ అధికారులు స్పందించి న్యాయం చేయాలి.
– నూలు చెన్నయ్య, రైతు, కోటితీర్థం
విచారణ జరిపి
చర్యలు చేపడతాం
కోటితీర్థంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న విషయమై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపడతాం. వీటిని కబ్జా చేయడం చట్ట విరుద్ధం.
– మస్తానయ్య, తహసీల్దార్, చేజర్ల మండలం
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అండ చూసుకొని చేజర్ల మండలంలోని పలు గ్రామాల్లో వందలెకరాల ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు కబ్జా చేశారు. మడపల్లి, నాగులవెల్లటూరు, పెరుమాళ్లపాడు, నూతక్కివారి కండ్రిక, తిమ్మాయపాళెం తదితర గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. మండలంలోని కోటితీర్థంలో వివాదాస్పద భూమికి కోర్టు స్టే విధించినా, ఆదేశాలను ధిక్కరిస్తూ వాటి చుట్టూ కంచెను వేసి మరీ నియోజకవర్గ స్థాయి నేత తన ఆధీనంలోకి తీసుకున్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ బాధితులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. కలెక్టర్ స్పందించి ఆక్రమణదారులపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.


