చేపల అక్రమ వేట నివారణకు నిరంతర గస్తీ | - | Sakshi
Sakshi News home page

చేపల అక్రమ వేట నివారణకు నిరంతర గస్తీ

Jun 15 2026 12:23 AM | Updated on Jun 15 2026 12:23 AM

నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలోని తీరంలో చేపల అక్రమ వేటను నివారించేందుకు గానూ రెండు మెకనైజ్డ్‌ బోట్లతో నిరంతర గస్తీని సోమవారం నుంచి నిర్వహించనున్నామని మత్స్యశాఖ సహాయ సంచాలకుడు చాంద్‌బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేటపై నిషేధం ముగియడంతో జిల్లా పరిధిలోని సముద్ర జలాల్లోకి తమిళనాడు బోట్లు అనధికారికంగా ప్రవేశించే అవకాశముందని చెప్పారు. ఈ క్రమంలో రెండు బోట్లతో గస్తీని మత్స్య, అటవీ శాఖలు, మైరెన్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించనున్నారని పేర్కొన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌, కృష్ణపట్నం పోర్టు నుంచి ఇవి బయల్దేరి గస్తీని నిర్వహించనున్నాయని వెల్లడించారు.

నేటి నుంచి ఎస్‌ఐఆర్‌

నెల్లూరు రూరల్‌: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని జిల్లాలో సోమవారం ప్రారంభించనున్నామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై ఒకటిని అర్హత తేదీగా పరిగణిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. జిల్లాలో 19,74,240 మంది ఓటర్ల వివరాల పరిశీలన కోసం 2352 మంది బూత్‌ స్థాయి అధికారులు నియమించామని తెలిపారు. ఇంటింటి సర్వేను బీఎల్వోలు జూలై 14 వరకు నిర్వహించి ఓటర్ల వివరాలను సేకరించనున్నారని వివరించారు. దీని ఆధారంగా ముసాయిదా జాబితాను వచ్చే నెల 21న ప్రచురించనున్నామని వెల్లడించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించేందుకు ఆగస్ట్‌ 20 వరకు అవకాశాన్ని కల్పించనున్నామని పేర్కొన్నారు. అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్‌ 18 వరకు కొనసాగింది, తుది జాబితాను అదే నెల 22న విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఓటర్లు తమ వివరాలను ధ్రువీకరించుకొని పేర్ల చేర్పు, తొలగింపు, సవరణల కోసం బీఎల్వోలకు సహకరించాలని కోరారు. జాబితాకు సంబంధించిన సేవల కోసం నియోజకవర్గ స్థాయిలో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల సంఘం హెల్ప్‌లైన్‌ 1950ను సంప్రదించి సమాచారాన్ని పొందొచ్చని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గానూ రాజకీయ పార్టీలు, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

డాక్టర్‌ పోస్టులకు

17 నుంచి ఇంటర్వ్యూలు

నెల్లూరు(అర్బన్‌): ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌, సివిల్‌ అసిస్టెంట్‌ జనరల్‌ పోస్టుల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియమించేందుకు గానూ ఇంటర్వ్యూలను ఈ నెల 17, 18న నిర్వహించనున్నామని జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి పరిమళ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అర్హత పత్రాలతో మద్రాస్‌ బస్టాండ్‌ సమీపంలోని డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయానికి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల్లోపు హాజరుకావాలని కోరారు. వివరాలకు spsnellore. ap. gov. in/ notice/ recruitmentను పరిశీలించాలని సూచించారు.

రెవెన్యూ డే

విజయవంతానికి కృషి

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో ఈ నెల 20న నిర్వహించనున్న రెవెన్యూ డే విజయవంతానికి రెవెన్యూ ఉద్యోగులందరూ కృషి చేయాలని ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి కోరారు. కలెక్టరేట్‌ ఆవరణలోని అసోసియేషన్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, డివిజన్‌, మండల స్థాయిల్లో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. రెవెన్యూ శాఖలోని అన్ని క్యాడర్లలో ఉద్యోగోన్నతులు, డిప్యూటీ తహసీల్దార్ల సీనియార్టీ జాబితాను రూపొందించాలని కోరారు. నెల్లూరుకు ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ నెల 17న రానున్నారని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లు, కార్మికుల సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు. తమ సమస్యలను ఉద్యోగులు వివరించాలని కోరారు. ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు శేషయ్య, హేమంత్‌కుమార్‌, మల్లికార్జున, బాలకోటమ్మ, రమాదేవి, డానియెల్‌ పీటర్‌, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement