పొదలకూరు: ఎడగారు (ఖరీఫ్)లోను యూరియా కష్టాలు రైతులకు తప్పడం లేదు. కొన్ని మండలాల్లో సరిపడా ఉన్నా, తీసుకెళ్లేందుకు వీరికి ఇక్కట్లు ఎదురవుతూనే ఉన్నాయి. అలివికాని నిబంధనలు, సాంకేతికత కారణంగా వీటిని పొందేందుకు తిప్పలు పడుతున్నారు. ఎరువుల దుకాణ యజమానులు సైతం తమకు కష్టాలు తప్పడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. యూరియాను ప్రభుత్వం సకాలంలో సరిపడా అందజేసేందుకే యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అయితే కర్షకులు మాత్రం యూరియాను అందించలేకే ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు యాప్‌లంటే తెలియవని.. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం కష్టంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
ఇదీ పరిస్థితి..
ఖరీఫ్‌లో వరిసాగు 3.75 లక్షలెకరాల్లో ఉంటుందనే అంచనాలతో సాగునీటిని అందజేసేందుకు ఐఏబీ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. అనధికారికంగా మరో 25 వేల ఎకరాల్లో పడే అవకాశముంది. జిల్లాలో 60 వేలకుపైగా ఎకరాల్లో నాట్లను ఇప్పటికే పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ లెక్కన ఎకరాకు నాలుగు కోటాల వంతున నాలుగు బస్తాల మేర యూరియాను సర్కార్ అందజేయాల్సి ఉంటుంది. జిల్లాలో వరి సాగును బట్టి సుమారు 16 లక్షల బస్తాలు అవసరమవుతాయి. కొందరైతే ఐదు కోటాల మేర వినియోగిస్తుంటారు. ఇలా మొదటి కోటా కింద నాలుగు లక్షలెకరాల్లో యూరియా అవసరం కాగా, ఆ స్థాయిలో ఇవ్వలేకపోతున్నారని అన్నదాతలు పేర్కొంటున్నారు.
ఇలా పొందాలి..
ఖరీఫ్ సీజన్లో పంటలను సాగుచేసే రైతులు యూరియాతో పాటు డీఏపీ కావాలంటే రైతు సేవా కేంద్రంలోని వీఏఏకు వివరాలను అందజేయాల్పి ఉంటుంది. వీటిని యాప్‌లో నమోదు చేస్తారు. పంటల విస్తీర్ణం, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం లేదా 1బీ నమునాను తీసుకొని వెరిఫికేషన్‌ను పూర్తి చేస్తే.. సొసైటీ, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా, డీఏపీ ఎరువులను పొందేందుకు వీలుంటుంది. ఇవి అవసరమైన రైతులు ఆర్‌ఎస్కే, గ్రామ వ్యవసాయ సహాయకుడి వద్ద వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకొని ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబర్ గల ఫోన్‌ను ఎరువుల దుకాణానికి తీసుకెళ్లి పొందాల్సి ఉంటుంది. కౌలుకు సాగు చేస్తున్న వారు పొలం యజమాని పట్టాదారు పాస్‌పుస్తకం లేదా 1బీ.. యజమాని ఆధార్ లింకై న మొబైల్ నంబర్‌ను తీసుకొని ఎరువుల దుకాణం వద్దకెళ్లి పొందే అవకాశముంది. డీలర్‌కు ఓటీపీని పొలం యజమాని చెప్పాల్సి ఉంటుంది. వెబ్ ల్యాండ్‌లో వివరాల్లేని రైతుల భూముల సాగుకు సంబంధించిన వివరాలను మండల వ్యవసాయాధికారి నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే కౌలు రైతు పొలం యజమాని విదేశాల్లో ఉన్నా.. అందుబాటులో లేకపోయినా, ఓటీపీ వెల్లడించేందుకు వీలుండదని రైతులు పేర్కొంటున్నారు. ఇలాంటి అలివికాని నిబంధనలను ఎందుకు విధించారో అంతుచిక్కడంలేదని వాపోతున్నారు.


