నూతన విద్యాసంవత్సర ప్రారంభం.. విద్యార్థుల తల్లిదండ్రులకు షాకిస్తోంది. కార్పొరేట్ పాఠశాలల్లో మోత మోగిస్తున్న ఫీజులను చూసి వీరు అయోమయానికి గురవుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం మేర అదనంగా చెల్లించాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. రూ.ముప్పై వేల నుంచి రూ.మూడు లక్షల వరకు ముక్కుపిండి వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చారు. ఇవన్నీ ఓ ఎత్తయితే నామమాత్రంగా క్వాలిఫైడ్ టీచర్లను ఏర్పాటు చేసి చదువు చెప్తున్నారు. వసతులు సైతం అంతంతమాత్రంగా ఉంటున్నాయి. ఇంత జరుగుతున్నా, చర్యలు చేపట్టాల్సిన విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు.
నెల్లూరు (టౌన్): జిల్లాలోని కార్పొరేట్ పాఠశాలల్లో ఫీ‘జులుం’ కొనసాగుతోంది. విద్యా ప్రమాణాల మాట అటుంచితే ఎంత దండుకుందామాననే రీతిలో యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. వాస్తవానికి స్కూళ్లు శుక్రవారం పునఃప్రారంభమయ్యాయి. అయితే రెండో శనివారం, ఆదివారం రావడంతో ఎక్కువ మంది సోమవారం నుంచి పంపేందుకు డిసైడ్ ఆయ్యారు. జిల్లాలోని 1050కుపైగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో 2.1 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు.
దీపం ఉండగానే..
ఈ పరిణామాల క్రమంలో తల్లిదండ్రుల ఆశలను క్యాష్ చేసుకోవాలనే రీతిలో యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ఫీజులను అమాంతంగా పెంచేసి దోపిడీ పర్వానికి తెరలేపారు. ఒకటో తరగతి నుంచే ఐఐటీ, నీట్, సివిల్ సర్వీస్ పేరుతో ఫీజులను నిర్ణయిస్తున్నారు. దీంతో పాటు స్కూళ్లకు ఆకర్షణీయమైన పేర్లు పెట్టి మభ్యపెడుతున్నారు. జిల్లాలో స్కూల్‌ను బట్టి రూ.30 వేల నుంచి రూ.మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నారంటే దోపిడీ పర్వం ఏ స్థాయిలో జరుగుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫీజుల పట్టికను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలనే నిబంధన ఎక్కడా అమలు కావడంలేదు.
వ్యాపార కేంద్రాలుగా..
● స్కూళ్లను ఆయా యాజమాన్యాలు వ్యాపార కేంద్రాలుగా మార్చేశాయి. బడుల్లో పుస్తకాలు, యూనిఫారం, స్టేషనరీ తదితరాలను విక్రయించకూడదనే రూల్ ఉన్నా, దాన్నెవరూ పట్టించుకోవడంలేదు.
● పాఠశాల బట్టి వీటికి రూ.ఐదు వేల నుంచి రూ.15 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. లైబ్రరీ, పరీక్ష ఫీజులంటూ ప్రత్యేకంగా లాక్కుంటున్నారు.
● క్యాంటిన్‌ను ఏర్పాటు చేశామని చెప్తూ, ఆయా రకాల తినుబండారాలకు బయట కంటే రెండింతలను వసూలు చేస్తున్నారు.
● పాఠ్య పుస్తకాలతో సంబంధం లేకుండా సొంత మెటీరియల్‌ను రూపొందించి వాటితోనే బోధన సాగిస్తున్నారు.
● డీజిల్ ధరలు పెరిగాయనే సాకుతో స్కూల్ బస్సుల రవాణా చార్జీలను రూ.ఐదు వేల నుంచి రూ.ఏడు వేల వరకు పెంచారు. కిలోమీటర్ దూరానికి సైతం ఒక్కొక్కరి నుంచి రూ.ఆరు వేలకుపైగా వసూలు చేస్తున్నారు.
అన్‌క్వాలిఫైడ్ టీచర్లతో బోధన
జిల్లాలోని అత్యధిక పాఠశాలల్లో అన్‌క్వాలిఫైడ్ టీచర్లతోనే బోధనను సాగిస్తున్నారు. వాస్తవానికి ఈ హోదా ఉండాలంటే బీఈడీని తప్పక పూర్తి చేయాలి. అయితే రికార్డుల్లో మాత్రం అందరూ క్వాలిఫైడ్ అనే తరహాలో చూపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థులతో బట్టీ పట్టించడమే తప్ప అర్థమయ్యే రీతిలో బోధించడంలేదు. ఈ ఒత్తిడ్ని స్టూడెంట్స్ భరించలేకపోతున్నారు.
జిల్లాలో ఇలా..
కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు – 1050
విద్యార్థులు – 2.1 లక్షలకుపైగా..
ప్రభుత్వ పరోక్ష కుట్ర
నిజానికి గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, టోఫెల్, డిజిటల్ విద్య తదితరాలను ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో వసతుల కల్పన కోసం నాడు – నేడు పథకాన్ని అమలు చేసి వాటి రూపురేఖలను సమూలంగా మార్చారు. ఈ క్రమంలో ఇందులో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరాక వీటిన్నింటికీ మంగళం పాడింది. ఫలితంగా స్టూడెంట్స్ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల బాట పట్టేలా పరోక్ష సహకారాన్ని సర్కార్ అందించింది.
వసతులు మృగ్యం
విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్న యాజమాన్యాలు, స్కూళ్లలో వసతులను కల్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లోనే బోధనను సాగిస్తున్నారు. సరిపడా టాయ్‌లెట్లు లేని పరిస్థితి నెలకొంది. అక్కడ అపరిశుభ్రత తాండవిస్తోంది. అపార్ట్‌మెంట్లలోనూ తరగతి గదులను నిర్వహిస్తున్నారు. మైదానమనేది ఎక్కడా కానరాదు. ఇండోర్ పేరుతో ఒక గదిని కేటాయించి రికార్డుల్లో మాత్రం ఇది ఉందని చూపుతున్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో మానసిక ఒత్తిడి తప్ప శారీరక వ్యాయామం లేదు. హాస్టళ్లలో నాసిరక భోజనాన్ని పెడుతున్నారు. మెస్ ధరలను ఎక్కువగా వసూలు చేస్తున్నా, మెనూ ప్రకారం పెట్టడంలేదు.
ఆకర్షణీయమైన పేర్లతో స్కూళ్ల ఏర్పాటు
గతేడాదితో పోలిస్తే
ఈ దఫా 30 శాతం పెంపు
రూ.ముప్పై వేల నుంచి
రూ.మూడు లక్షల వరకు వసూలు
యూనిఫారం, పుస్తకాలు, స్టేషనరీతో అదనపు దోపిడీ
క్వాలిఫైడ్ టీచర్లు తక్కువ
బెంబేలెత్తుతున్న తల్లిదండ్రులు
తన కుమార్తెకు అడ్మిషన్ నిమిత్తం నగరానికి చెందిన రాజేష్.. కార్పొరేట్‌కు సంబంధించిన సీబీఎస్‌ఈ స్కూల్‌కెళ్లారు. ఒకటో తరగతిలో అడ్మిషన్ కావాలంటూ అక్కడ రిసెప్షన్లో ఉన్న సిబ్బందిని సంప్రదించారు. ఐఐటీ ఫౌండేషనా.. నీట్ ఫౌండేషనానని వారు అడగ్గా, ఇదేమీ ఆయనకు అర్థం కాలేదు. ఒకటో తరగతిలో ఇవేంటానని తనకు తానే ప్రశ్నించుకున్నారు. ఎందులో ఎంత ఫీజుంటుందో చెప్పాలని కోరగా, ఐఐటీకి రూ.1.5 లక్షలు.. నీట్‌కై తే రూ.1.75 లక్షలని వారు సెలవిచ్చారు. యూనిఫారం, పుస్తకాలు, స్టేషనరీకి అదనపు మొత్తాన్ని కట్టాలని వారు చెప్పడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోవడం ఈయన వంతైంది. జిల్లాలోని అన్ని సూళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది.
నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు
ప్రభుత్వ నిబంధనలను కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు చేపడతాం. అధిక ఫీజుల వసూలు.. పుస్తకాలు, యూనిఫారాలను విక్రయించకూడదు. వాట్సాప్ ద్వారా నోటీసులను ఇప్పటికే రెండు, మూడుసార్లు పంపాం. రూల్స్‌ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. స్కూళ్లను మానిటరింగ్ చేసి నిబంధనలను అతిక్రమించారని గుర్తిస్తే చర్యలు చేపడతాం.
– బాలాజీరావు, డీఈఓ


